నాడు సోవియట్ యూనియన్‌ను నిలువరించడానికి ఐరోపాలో 'నాటో' సైనిక కూటమిని ఏర్పరచిన అమెరికా, నేడు ఆసియాలో చైనాకు అడ్డుకట్ట వేయడానికి 'క్వాడ్' రూపంలో ఆసియా నాటోను సిద్ధం చేయాలని లక్షిస్తోంది. క్వాడ్‌లో అమెరికాతోపాటు సభ్యులుగా ఉన్న భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు సైనిక కూటమిగా ఏర్పడటానికి ఇంతవరకు తొందరపడకపోయినా, ఇటీవల చైనా కత్తి ఝుళిపింపులు ఎక్కువ అవడంతో పరిస్థితి మారుతోంది. అక్టోబరు 6న టోక్యోలో క్వాడ్ సమావేశం జరిగిన తరవాత 26, 27 తేదీలలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్, శ్రీలంక, మాల్దీవులను సందర్శించారు. భారత్‌తో కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అమెరికా అండగా నిలబడుతుందని ప్రకటించారు. దీంతో తీవ్రంగా కలవరపడిన చైనా- ద్వైపాక్షిక సమస్యలను మూడో పక్షం జోక్యం లేకుండా దిల్లీ, బీజింగ్‌లు పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చింది.
'డ్రాగన్' ప్రాబల్యానికి అడ్డుకట్ట
అసలు పరిస్థితి ఈకాడికి రావడానికి చైనా కబ్జాకోరు ధోరణే కారణం. 2007లో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో చతుర్భుజి (క్వాడ్) ఏర్పడిన నాటి నుంచే దాన్ని ‘ఆసియన్ నాటో’గా మలచాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ, మిగతా మూడు భాగస్వామ్య దేశాలు చైనాతో నేరుగా తలపడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంతలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ 2017నుంచి తమ ప్రథమ శత్రువు చైనాయే అన్నట్లు ప్రవర్తించసాగారు. ఇక చైనా తన ఇరుగుపొరుగులతో కయ్యానికి కాలు దువ్వడం ఎక్కువ చేసింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు దౌత్య ప్రతినిధుల స్థాయికి పరిమితమైన క్వాడ్ సమావేశాలు అక్టోబరు 6న విదేశాంగ మంత్రుల స్థాయికి ఎదిగాయి. ఆ రోజు టోక్యోలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కరోనా వైరస్ వుహాన్‌లో పుట్టిందనీ, చైనా కమ్యూనిస్టు పార్టీ దాన్ని గుట్టుగా ఉంచడంతో ప్రపంచ పరిస్థితి దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో; తైవాన్ జలసంధిలో, మెకాంగ్‌లో, హిమాలయాలలో చైనా ఆగడాలు పొరుగుదేశాలను కలవరపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కానీ; జపాన్, ఆస్ట్రేలియా మంత్రులు కానీ చైనాను పేరెత్తి విమర్శించడానికి ఇష్టపడలేదు. మహా సముద్రాలలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ ప్రకటించగా, జర్మనీ చైనాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతోంది. ఉమ్మడి ప్రమాణాలను అనుసరించే అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాలనీ, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలనీ, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు క్వాడ్ భేటీలో కోరారు.
మొత్తం మీద చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా ఈ అక్టోబరులో ఇండో పసిఫిక్, దక్షిణాసియాలపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబరు 6న క్వాడ్ భేటీలో పాంపియో పాల్గొనగా, అక్టోబరు 14న అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్ బీగన్ భారత్ సందర్శనకు వచ్చారు. చైనాపై ఆధారపడకుండా క్వాడ్ దేశాలు పకడ్బందీ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవాలని, సముద్ర భద్రతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత్‌నుంచి ఆయన బంగ్లాదేశ్‌కు వెళ్లారు. చైనా దూకుడును నిలువరించడానికి ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందుకే అక్టోబరు 26న భారత్‌కు వచ్చి కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న పాంపియో 27న శ్రీలంక వెళ్లారు. ఆపైన మాల్దీవులను కూడా సందర్శిస్తారు. భారత్, అమెరికాలు కుదుర్చుకున్న కీలక బెకా ఒప్పందం చైనాను కలవరపెడుతోంది.