దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10 శాతం లోపే ఉంటోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఒకటి మాత్రమే యాక్టివ్ కేసు ఉందని తెలిపింది. అలాగే.. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 5 శాతం లోపేనని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,15,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 9.29 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
" మరోమైలు రాయిని అందుకున్నాం. గత మూడు రోజులుగా రోజువారి పాజిటివిటీ రేటు 5 శాతం లోపే ఉంచగలుగుతున్నాం. అది కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలుగుతున్నట్లు సూచిస్తోంది. బుధవారం రోజువారి పాజిటివిటీ రేటు 3.8 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులూ గణనీయంగా తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా 7.5 లక్షలలోపే ఉంటున్నాయి. "