ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే కఠిన లాక్‌డౌన్, స్వీయ నిర్బంధమే శరణ్యమని వుహాన్‌లోని ప్రవాస భారతీయులు అంటున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టొద్దని ఇక్కడి పౌరులకు సూచిస్తున్నారు. వైరస్ ముప్పుతో చైనా నుంచి 700 మంది పౌరులను భారత్ స్వదేశానికి తరలించినా కొందరు ధైర్యంగా అక్కడే ఉండిపోయారు. 76 రోజుల కఠిన లాక్‌డౌన్ ముగియడం సంతోషంగా ఉందన్నారు. అయితే లక్షణాలు కనిపించని వైరస్ వాహకులు ఉండొచ్చన్న భయంతో బయటకు వెళ్లడం లేదంటున్నారు.
మాట్లాడలేక పోతున్నా: సత్రాజిత్
'73 రోజులు ఇంటికే పరిమితం అయ్యాను. మా ప్రయోగశాల సమీపంలోనే ఉండటంతో అనుమతి తీసుకొని వెళ్లాను. ప్రస్తుతం నేను మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే ఇన్ని వారాలు అందరూ ఇళ్లల్లోనే ఉండటంతో నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదని' వుహాన్‌లో హైడ్రాలజిస్టుగా పనిచేస్తున్న అరుణ్‌జీత్ టీ సత్రాజిత్ అన్నారు.
వుహాన్ నుంచి మేమిచ్చే సలహాలివే.. ముందే లాక్‌డౌన్ పెట్టుంటే: మరో శాస్త్రవేత్త
లాక్‌డౌన్ ముగిసినందుకు సంతోషంగా ఉన్నా వైరస్ వాహకుల భయంతో బయటకు వెళ్లడం లేదని ఓ శాస్త్రవేత్త అన్నారు. భారతీయులు కచ్చితంగా, కఠినంగా లాక్‌డౌన్ పాటించాలని సూచించారు. వుహాన్‌లో మరికొన్ని రోజులు ముందుగానే లాక్‌డౌన్ పెట్టుంటే ఈ స్థాయిలో వైరస్ విజృంభించేది కాదన్నారు. స్వదేశంలో కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం భారత దౌత్యకార్యాలయం కోరినా వుహాన్‌లోనే ఉండిపోయానన్నారు. ‘ఇక్కడి ఆతిథ్యాన్ని నేను ఆస్వాదిస్తాను. నా యజమాని, స్థానిక మిత్రులు జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకం ఉండేది. వారు అలాగే నన్ను చూసుకున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
వుహాన్ నుంచి మేమిచ్చే సలహాలివే.. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష
కష్టాల్ని వదలి పారిపోవడం భారతీయుల నైజం కాదని కేరళకు చెందిన అరుణ్‌జీత్ అన్నారు. ఒకవేళ కేరళకు తిరిగొచ్చినా తన భార్య, పిల్లలు, 70 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులకు ప్రమాదమని వుహాన్‌లోనే ఉన్నానన్నారు. ఒకప్పుడు మైక్రో బయాలజిస్టైన ఆయన ప్రస్తుతం హైడ్రాలజిస్టుగా పనిచేస్తున్నారు. భారత్ సరైన సమయంలో లాక్‌డౌన్ విధించిందని, వర్షాకాలం ఆరంభమైతే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గి సమస్య అత్యంత జటిలమయ్యేదని వివరించారు. చల్లని వాతావరణంలో వైరస్ విజృంభిస్తుందని వెల్లడించారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం, స్వీయ నిర్బంధంలో పాల్గొనడమే వుహాన్ నుంచి భారతీయులకు తానిచ్చే సలహా అన్నారు. '72 రోజులు నా గదికే అంకితమయ్యా. మా పొరుగింట్లో వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ఒక్కసారీ ఫ్లాట్ బయటకు రావడం నేను చూడలేదని' ఆయన అన్నారు.
వుహాన్ నుంచి మేమిచ్చే సలహాలివే.. ఇంకా భయం భయంగానే..
గతేడాది డిసెంబర్లోనే సహచర శాస్త్రవేత్తలు వైరస్ వ్యాప్తి గురించి విన్నారని అరుణ్‌జిత్ చెప్పారు. పరిస్థితి విషమించడంతో మాస్క్‌లు ధరించారని తెలిపారు. వుహాన్లో లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ లక్షణాలు కనిపించని వ్యక్తులు తిరుగుతారన్న భయంతో చాలామంది బయటకు రావడం లేదన్నారు. 'వైరస్‌ను అర్థం చేసుకోవడం సులభం కాదు. ఎంతో సంక్లిష్టమైన జీరో కేస్‌ను గుర్తించేంత వరకు అర్థమవ్వదు. అందుకే మొదట చైనీస్ త్వరగా చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత వేగంగా చర్యలు తీసుకున్నారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అటవీ జంతువులను విపరీతంగా తినే అలవాటుంది. అందుకే జంతువుల నుంచే మనుషులకు వైరస్ సోకిందన్న అనుమానాలు ఉన్నాయని' అరుణ్‌జిత్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మందికి కరోనా సోకగా 88,500కి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి:కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్లు మంజూరు