తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా వైమానిక కార్యకలాపాలు ఎక్కువైన నేపథ్యంలో... భారత బలగాలు గగనతల రక్షణ క్షిపణులను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించాయి. రష్యాకు చెందిన ఇగ్లా గగనతల రక్షణ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధాలను సరిహద్దులో ఉన్న కీలకమైన ఎత్తుల్లో మోహరించినట్లు సైన్యం తెలిపింది.
క్షిపణి వ్యవస్థలు, రాడార్లు మోహరించడం ద్వారా సరిహద్దుల్లో డ్రాగన్ కదలికలపై నిఘాను భారత్ మరింత మెరుగుపరిచింది. ఇటీవల గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్ 14కు సమీపంగా వచ్చేందుకు అనేక చైనా చాపర్లు ప్రయత్నించడాన్ని భారత దళాలు గమనించాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు జరిపే ఎలాంటి గగనతల ఉల్లంఘనలనైనా విఫలం చేయడానికి వైమానిక దళం ఇప్పటికే సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానాలను మోహరించినట్లు సైన్యం వెల్లడించిది.