వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి, దౌత్యవేత్త జీ రోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల 29-30 మధ్యరాత్రిప్యాంగాంగ్ దక్షిణ ఒడ్డున తమ సైన్యం అతిక్రమణకు పాల్పడలేదని వెల్లడించారు. చైనా ప్రయత్నాలను తమ జవాన్లు వమ్ము చేశారన్న భారత్ వాదనను ఆయన ఖండించారు. భారత జవాన్లే అతిక్రమణకు పాల్పడి సరిహద్దులో శాంతికి విఘాతం కలిగించారని ఆరోపించారు.
"గతంలో జరిగిన చర్చల్లో సంప్రదింపుల ద్వారా కుదిరిన అంగీకారాన్ని భారత్ ఉల్లంఘించింది. ప్యాంగాంగ్లోని దక్షిణ ఒడ్డున ఉన్న ఎల్ఏసీ, చైనా-భారత్ సరిహద్దు వెంబడి ఉన్న రెఖిన్ పాస్ వద్ద అతిక్రమణకు పాల్పడింది. చైనా దళాలను రెచ్చగొట్టింది. దీంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని, సంబంధిత ఒప్పందాలను ఉల్లంఘించాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు ఎంతో కాలంగా జరుపుతున్న చర్చలకు ఈ చర్యలు విఘాతం కలిగించాయి. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది."