తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​ - ఉద్రిక్త వాతావరణం భారత్ చైనా

Indian troops
హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

By

Published : Aug 31, 2020, 11:16 AM IST

Updated : Aug 31, 2020, 12:29 PM IST

12:28 August 31

చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది. తద్వారా భారత సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించిందని సైనిక వర్గాలు తెలిపాయి. చైనా కుట్రలను ముందుగానే పసిగట్టిన మన బలగాలు వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. ఆగస్టు 29-30 మధ్యరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపాయి. ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చేందుకు యత్నిస్తున్న చైనా దుశ్చర్యలను ఎప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా మన భూభాగంలోని సైనిక స్థావరాల్ని సర్వసన్నద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.

చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకునేందుకే తాము మొగ్గుచూపుతామని భారత సైన్యం పునరుద్ఘాటించింది. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడే విషయంలో మాత్రం రాజీపడబోమని స్పష్టం చేసింది. తాజా వివాదాల్ని పరిష్కరించుకునేందుకు చుశుల్‌ ప్రాంతంలో ప్రస్తుతం చర్చలు ప్రారంభమైనట్లు తెలిపింది. 

ఇప్పటి వరకు పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపు తన సైనిక కార్యకలాపాల్ని ప్రారంభించేందుకు కుట్ర పన్ని తోకముడిచిన డ్రాగన్‌ సేన.. తాజాగా సరస్సు దక్షిణం వైపు కన్నేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ కూడా తలెత్తినట్లు సమాచారం. ఘర్షణ జరిగినట్లు మాత్రం ఆర్మీ ప్రకటించలేదు. కేవలం రెచ్చగొట్టేందుకు యత్నించినట్లు మాత్రమే తెలిపింది. 

తూర్పు లద్దాఖ్‌లో రెండు నెలల క్రితం నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఇంకా పూర్తిగా సమసిపోకముందే చైనా మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. గల్వాన్‌ ఘర్షణకు కారణమైన సైనిక మోహరింపుల్ని డ్రాగన్‌ ఇంకా పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సి ఉంది. పరస్పర సహకారం ఉంటేనే సైన్యం ఉపసంహరణ పూర్తవుతుందని భారత్‌ గత వారం స్పష్టం చేసింది.

పాంగాంగ్‌ వద్ద వివాదం ఇదీ..
పాంగాంగ్‌  సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60శాతం టిబెట్‌ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా  దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు  ‘ఫింగర్స్‌’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ ‘ఫింగర్‌ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్‌ సైన్యాన్ని ఫింగర్‌2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్‌ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు పెట్రోలింగ్‌ చేస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్‌ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో చైనా ఎల్‌ఎక్స్‌ రకం బోట్లను తీసుకొచ్చింది.  

వీటి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఏమిటీ..?

ఇవి బంజరు పర్వతాలు మాత్రమే. చైనా వీటిపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వెనుక చాలా వ్యూహం ఉంది. భారత్‌ ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడకు శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. 

కార్గిల్‌ యుద్ధ సమయంలోనే..

కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఫింగర్‌ వద్ద రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫింగర్‌ 2-3 మధ్య ఈ నిర్మాణం జరుగుతోంది. భారత్‌తో పోలిస్తే చైనా దళాలు ఈ ప్రదేశానికి వేగంగా చేరుకొనే అవకాశాలను ఇది కల్పిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇక్కడ భారత పెట్రోలింగ్‌ను అడ్డుకొనేందుకు చైనా భారీ సంఖ్యలో దళాలను తరలించింది. 

11:12 August 31

సరిహద్దు ఉద్రిక్తతలు: మరోసారి హద్దు మీరిన చైనా

మరోసారి ఉద్రిక్తత..

తూర్పు లద్దాఖ్​ వద్ద చైైనా మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య చర్చల్లో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆగస్ట్​ 29న రాత్రి చైనా జవాన్లు హద్దు మీరినట్లు తెలుస్తోంది. వాస్తవ సరిహద్దును మార్చే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

హద్దు మీరిన చైనా బలగాలను భారత జవాన్లు దీటుగా అడ్డుకున్నాయి. వాస్తవ సరిహద్దును కాపాడేలా చర్యలు చేపట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. చైనాతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోనున్నట్లు పేర్కొన్నాయి. అయితే చైనా ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాయి సైనిక వర్గాలు.

ఘర్షణ దృష్ట్యా చూషుల్‌లో కమాండర్ స్థాయి అధికారుల ఫ్లాగ్ భేటీ జరుగుతోంది. సమస్య పరిష్కారంపై అధికారులు చర్చిస్తున్నారు.

Last Updated : Aug 31, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details