అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించడానికి ముందే భారతీయ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. కొద్ది నెలల క్రితం సుమారు 100 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు వీసా నిబంధనలు ఉల్లంఘించారనే కేసులో నిర్బంధించిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా వర్సిటీల్లో ప్రవేశం పొందడానికి ముందు, ముఖ్యంగా మూడు విషయాలని పరిగణనలోకి తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
క్యాంపస్ నుంచే యూనివర్సిటీ పని చేస్తోందా? లేక పరిపాలనా ప్రాంగణాన్ని మాత్రమే కలిగి కేవలం వెబ్సైట్ మాత్రమే నిర్వహిస్తోందా అన్నది గమనించాలి.
ఆ విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది, సాధారణ శిక్షకులు, విద్యావేత్తలు ఉన్నారా? అని తెలుసుకోవాలి. కొన్ని వర్సిటీల్లో కేవలం పరిపాలనా సిబ్బంది మాత్రమే ఉంటారు. వారి వెబ్సైట్లలో అధ్యాపకుల వివరాలు ఉండవు. ఈ అంశాలను కచ్చితంగా చూసుకోవాలి.
విశ్వవిద్యాలయానికి తగిన పాఠ్యప్రణాళిక ఉందా, క్రమపద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారా? ప్రణాళికాబద్ధంగా బోధన, ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలు సరిగ్గా అమలు అవుతున్నాయా? చూసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ అంశాలు లేకపోతే అటువంటి వర్సిటీలు నకిలీవని గుర్తించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఇలాంటి నకిలీ వర్సిటీల్లో చేరినవారు, సాధారణ విద్యార్థుల వీసా కలిగి ఉన్నప్పటికీ, వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లే పరిగణిస్తారు. వారిని నిర్బంధించడానికి, అమెరికా నుంచి బహిష్కరించడానికి అవకాశం ఉంది.
ఇదీ విషయం...