చంద్రయాన్-3 ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది. జాబిల్లిపై చేపట్టే ఈ ప్రయోగం 2020లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన నేపథ్యంలో.. ఈ మేరకు ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్.
బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు శివన్. ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ మిషన్‌కు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
" చంద్రయాన్-2లో మంచి పురోగతి సాధించాం. సురక్షితంగా ల్యాండింగ్ చేయలేకపోయినప్పటికీ.. ఆర్బిటర్ అద్భుత పనితీరు కనబరుస్తోంది. రానున్న ఏడేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఒక ప్రధాన విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నా. చంద్రయాన్-3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు రూపకల్పన పూర్తయింది. చంద్రయాన్-3 పనులు సజావుగా సాగుతున్నాయి. దీని ఆకృతి చంద్రయాన్-2 లానే ఉంటుంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు ఉన్నాయి. ఆర్బిటర్ పని చేస్తోన్న క్రమంలో దానిని వినియోగించుకుంటాం. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్లతో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది."