తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధమేఘాలు- నివురుగప్పిన నిప్పులా నిర్మల హిమగిరులు - india china news

లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎల్‌ఏసీ వద్ద భారీగా బలగాల మోహరింపులు జరుగుతున్నాయి. యుద్ధ ట్యాంకులు పరస్పరం దాడి చేసుకునేంత సమీపంలో ఉన్నాయి. పాంగాంగ్‌ దక్షిణ తీరంలోని పర్వత ప్రాంతాలను భారత్ స్వాధీనం చేసుకుంది.

Indian side responded to China's provocative actions and took appropriate defensive measures: MEA on Chinese attempts in Pangong area.
లేహ్, లద్దాఖ్​లో భారత వైమానిక నిఘా హెలికాఫ్టర్ చక్కర్లు

By

Published : Sep 2, 2020, 7:13 AM IST

నిర్మల హిమగిరులు నివురుగప్పిన నిప్పును తలపిస్తున్నాయి. యుద్ధ విమానాల చక్కర్లు, భారీ ట్యాంకుల మోహరింపులతో అక్కడ యుద్ధ వాతావరణం ప్రతిబింబిస్తోంది. చైనా ఎత్తులకు భారత్‌ పై ఎత్తులు వేస్తూ.. వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఇప్పుడు రెండు దేశాల యుద్ధ ట్యాంకులు పరస్పరం దాడిచేసుకునేంత దగ్గరలో ఉన్నాయి. ఇరుదేశాలూ ఎల్‌ఏసీకి ఇరువైపులా లక్ష మంది చొప్పున మోహరించినట్లు సమాచారం. భారీ ట్రక్కులు ఆయుధ సామగ్రిని చేరవేస్తున్నాయి.

గల్వాన్‌ లోయలో రెండున్నర నెలల కిందట చైనా తీసిన దొంగదెబ్బకు భారత్‌ ఇప్పుడు దీటుగా సమాధానం ఇచ్చింది. పాంగాంగ్‌ ఉత్తర రేవును డ్రాగన్‌ ఆక్రమించినందుకు ప్రతీకారంగా ఇప్పుడు దక్షిణ రేవును భారత్‌ తన వశం చేసుకుంది. ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ దొంగచాటుగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన చైనాకు ఝలక్‌ ఇచ్చింది. ఆ ప్రాంతంలోని కీలక పర్వత శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ఈ ప్రాంతంపై భారత్‌ పూర్తిగా పట్టుబిగించింది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రాగన్‌ కదలికలను విస్పష్టంగా వీక్షించొచ్చు. వాస్తవాధీన రేఖగా భావిస్తున్న ప్రాంతాన్ని తాము దాటలేదని మన సైనికాధికారులు ప్రకటించారు. ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం రెండు పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదేపదే విఫలయత్నం చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది. ఫలితంగా ఇరు దేశాల సైనిక మోహరింపులు ముమ్మరమయ్యాయి.

అక్కడ ఏం జరిగిందంటే...

సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. శనివారం రాత్రి చుషుల్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న మోల్దో నుంచి భారీగా చైనా ట్యాంకులు, వ్యాన్‌లు ముందుకు కదలడం అరంభించాయి. ఈ బృందంలో 200-500 మంది సైనికులు ఉన్నట్లు అంచనా. అక్కడి ముఖ్యమైన పర్వత శిఖరం 'బ్లాక్‌ టాప్‌'ను చేజిక్కించుకోవాలన్నది డ్రాగన్‌ ఉద్దేశం. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత శిబిరాలను, కార్యకలాపాలను తేలిగ్గా పర్యవేక్షించొచ్చని భావించింది. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. సరస్సు దక్షిణ రేవులో కీలక పర్వత శిఖరాలను తానే ముందుగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)కు అనుమతించింది. ఈ దళం వెంటనే రంగంలోకి దిగి, పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఎటు చూసినా కెమెరాలు.. ఎక్కడికక్కడ నిఘా పరికరాలు.. ఇది పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఉన్న పర్వతం పరిస్థితి. అయితే వీటన్నింటినీ దీటుగా ఎదుర్కొని చైనా సైన్యం కన్నా ముందే భారత బలగాలు శరవేగంగా ప్రతిస్పందించాయి. చైనా నిఘా పరికరాల్ని అక్కడ్నుంచి తొలగించాయి. భారత చర్యతో బిత్తరపోయిన చైనా.. ట్యాంకులను రంగంలోకి దించింది. మన సైన్యం కూడా అదే స్థాయిలో టి-72, టి-90 ట్యాంకులను మోహరించింది. అయితే మన బలగాలు కీలక పర్వత శిఖరాలపై మోహరించి ఉండటం, ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణుల (ఏటీజీఎం)నూ రంగంలోకి దించడంతో డ్రాగన్‌ బలగాలు ముందడుగు వేయలేకపోయాయి. తాజా చర్యతో కీలకమైన 'స్పాంగుర్‌ గ్యాప్‌' అనే ప్రాంతాన్ని భారత్‌ విస్పష్టంగా పరిశీలించగలుగుతుంది. ఈ పర్వతమయ ప్రాంతంలో ఇది చాలా కీలక మార్గం. పొరుగునున్న స్పాంగుర్‌ సరస్సు దక్షిణ రేవులో చైనా ఒక తారు రోడ్డును కూడా నిర్మించింది. దీనిపై భారీ యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలను తరలించే వీలుంది. ఇక్కడి ఎత్తయిన ప్రాంతాలపై మన బలగాలు మోహరించడం వల్ల చైనా వాహనాల కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. సమీపంలోని రెజాంగ్‌ లా సహా అనేక కీలక ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను భారత్‌ మోహరించినట్లు మన అధికారులు చెప్పారు. 1962 యుద్ధం సమయంలో పాంగాంగ్‌ దక్షిణ రేవు ప్రాంతంలో ఇరు దేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు జరిగాయి.

ప్రాణనష్టం.. ?

శనివారం నాటి ఆపరేషన్‌లో ఇరు సైన్యాల మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగిందని, ప్రాణ నష్టం కూడా చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. 1962 నాటిదిగా భావిస్తున్న ఒక మందుపాతరపై కాలుపెట్టడం వల్ల ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ అధికారి, ఒక జవాను మరణించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. కొందరు బందీలుగా పట్టుబడ్డారని కూడా తెలిపాయి. అయితే అధికార వర్గాలు వీటిని ధ్రువీకరించలేదు. మన బలగాలు చైనా శిబిరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

మంగళవారం శ్రీనగర్-లద్దాఖ్ జాతీయ రహదారిపై సైనిక వాహనం

ఆత్మరక్షణ కోసమే...

పాంగాంగ్‌ దక్షిణ రేవులో మోహరింపును పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యగా భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఎదురుదాడి ఉద్దేశం కాదని వివరించాయి. ఇక్కడి కీలక చుషుల్‌ లోయలోని భారత భూభాగాన్ని రక్షించుకునేందుకే ఇలా చేశామని తెలిపాయి. ఈ ప్రాంతంలో చైనా కదలికలను పసిగట్టడం వల్ల ఇప్పుడు అక్కడి పర్వత శిఖరాలపై మోహరించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

బుకాయింపు...

భారత్‌ ఆక్రమించిన పర్వత ప్రాంతాన్ని తమదిగా డ్రాగన్‌ వాదిస్తోంది. తమ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని, రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను భారత్‌ ఉల్లంఘించి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టిందని దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఆరోపించింది. భారత సైనిక చర్య వల్ల సరిహద్దు ప్రాంతంలో శాంతికి తీవ్ర విఘాతం కలిగిందని పేర్కొంది. పాంగాంగ్‌లోని దక్షిణ ఒడ్డున ఉన్న రెఖిన్‌ పాస్‌ వద్ద అతిక్రమణకు పాల్పడిందని ఆరోపించింది. తక్షణం ఆ ప్రాంతాల నుంచి భారత్‌ వైదొలగాలని డిమాండ్‌ చేసింది. ఇతర దేశాల భూభాగాన్ని అంగుళం కూడా తాము ఆక్రమించలేదని, కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగ్‌ బీజింగ్‌లో తెలిపారు. భారత్‌, చైనా మధ్య సరిహద్దులు ఖరారు కాలేదని, అందువల్లే తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. విభేదాలు.. ఘర్షణలుగా మారకుండా చూడాలని ఇరు దేశాల అగ్రనాయకులు తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ద్వారా భారత్‌తో అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధమని చెప్పారు.

చర్చలు

తాజా సరిహద్దు వివాదంపై భారత్‌, చైనా చర్చలు జరుపుతున్నాయి. బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుషుల్‌/మోల్డో ప్రాంతంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ చర్చలు మొదలయ్యాయి. రెండు పక్షాలూ సోమవారం ఆరు గంటల పాటు ఈ అంశాన్ని చర్చించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు.

పదేపదే...

రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సోమవారం కూడా కవ్వింపు చర్యలకు ప్రయత్నించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మంగళవారం ఆరోపించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల సైనికాధికారులు ఒకపక్క చర్చలు జరుపుతుండగానే ఈ పరిణామం జరిగిందని పేర్కొన్నారు. భారత సైన్యం సకాలంలో స్పందించి, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసిందని తెలిపారు.

దూకుడే..: భారత్‌ నిర్ణయం

చైనా సరిహద్దుల్లోని పరిణామాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, వైమానిక దళాధిపతి ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఎల్‌ఏసీలోని సున్నితమైన ప్రాంతాల్లో దూకుడుగానే వ్యవహరించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

లేహ్, లద్దాఖ్​లో భారత వైమానిక నిఘా హెలికాఫ్టర్ చక్కర్లు

పర్వత యోధులు

పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులో పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్‌లో భారత్‌కు చెందిన అత్యంత రహస్య విభాగం 'స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌' (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పాలుపంచుకుంది. భారత గూఢచర్య విభాగమైన 'రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌' (రా)లోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (డీజీఎస్‌) ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. పనిచేస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని క్యాబినెట్‌ సచివాలయం ఆదేశాల మేరకు కార్యకలాపాలు సాగిస్తుంటుంది. 1962లో భారత్‌, చైనా మధ్య యుద్ధం తర్వాత డీజీఎస్‌ ఏర్పడింది. ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను 'ఎస్టాబ్లిష్‌మెంట్‌ 22'గా కూడా పిలుస్తారు. దేహ్రాడూన్‌ సమీపంలోని చక్రతా దీని ప్రధాన కార్యాలయం. ఎస్‌ఎఫ్‌ఎఫ్‌లో మొత్తం 5వేల మందితో ఐదు బెటాలియన్లు ఉన్నాయి. వీరంతా పర్వత ప్రాంత యుద్ధరీతుల్లో సుశిక్షితులు. ఇందులో ప్రధానంగా.. భారత్‌లో స్థిరపడ్డ టిబెట్‌ సంతతివారు ఉంటారు. సైన్యంలోని పారాచూట్‌ రెజిమెంట్‌కు చెందిన ప్రత్యేక బలగాల సభ్యులు కూడా ఉన్నారు. భారత సైనికాధికారులే ఈ బెటాలియన్లకు నేతృత్వం వహిస్తున్నారు. 1971 నాటి భారత్‌-పాక్‌ యుద్ధం నుంచి 1999 నాటి కార్గిల్‌ పోరు వరకూ అనేకచోట్ల ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ తన సత్తాను చాటింది. ఈ దళంలోని 'వికాస్‌' బెటాలియన్‌ తాజా ఆపరేషన్‌ను చేపట్టింది. భారత సైన్యంలోని సిక్కు లైట్‌ ఇన్‌ఫ్యాంట్రీ దళం కూడా ఇందులో పాల్గొంది.

ABOUT THE AUTHOR

...view details