ఓ మంచి ఆశయంతో సుదీర్ఘ పరుగును చేపట్టాడు భారతీయుడు. యూఏఈలోని యువకులకు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మారథాన్‌ను చేపట్టి ఘనంగా ముగించాడు కేరళకు చెందిన ఆకాశ్ నంబియార్. జనవరి 25న అబుదాబిలోని కార్నిచ్ నుంచి పరుగును ప్రారంభించిన నంబియార్.. ఈ-11 రహదారి వెంట 26న దుబాయ్‌లోని ఐబీఎన్ బత్తాటాకు చేరుకున్నాడు.
27 గంటలు... 118 కిలోమీటర్లు...
అబుదాబి నుంచి దుబాయ్ వరకు విరామం లేకుండా 27 గంటల్లోనే 118 కిలోమీటర్లు పరుగెత్తి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు నంబియార్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) యువకుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం కోసమే ఈ సాహసం చేసినట్లు చెప్పాడు.
'యూఏఈలో ఊబకాయం, ధూమపానం ఎక్కువగా ఉంది. 35 ఏళ్లలోపు వారు కూడా శారీరకంగా చురుకుగా ఉండట్లేదు. యువకులు ఫిట్నెస్ను విస్మరిస్తున్నారు. వారికి ఆరోగ్యం ఆవశ్యకతను తెలియజేయాలనుకున్నా. అందుకే ఈ కార్యక్రమం చేపట్టా. ఈ విషయంలో నా మిత్రుడు ఖలీద్ నాకు స్ఫూర్తి. అతడు అబుదాబి నుంచి మక్కాకు పరుగెత్తాడు. అతని నుంచే ప్రేరణ పొందాను.'
- ఆకాశ్ నంబియార్
ఇలా పరుగెత్తడం నంబియార్‌కు కొత్తేమీ కాదు. గతంలో శ్రీలంకలోని కొలంబో నుంచి పూణవాతున వరకు 120 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాడు. రాబోయే ఐదు నెలల్లోనే మరో సుదీర్ఘ రన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇదీ చూడండి: ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా?