తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ తపాలా శాఖ 'ప్రేమానురాగాల' డెలివరీ! - lockdown latest news

కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా సౌకర్యాలు లేవు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల అవసరాలను తీరుస్తోంది తపాలా శాఖ. వస్తువులను చేరవేయటమే కాక.. కొన్ని సందర్భాల్లో బంధువుల యోగక్షేమాలు తెలుపుతూ అందరి మన్ననలు పొందుతోంది.

Indian Post Office
కరోనా కష్టకాలంలో పౌరులకు అండగా 'తపాలా శాఖ'

By

Published : Apr 13, 2020, 2:18 PM IST

అంతర్జాల విప్లవంలో భాగంగా వందలాది సామాజిక మాధ్యమాలు, ఈమెయిల్​ సేవలు అందుబాటులోకి వచ్చి.. భారతీయ తపాలా శాఖ తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. కానీ.. ప్రస్తుతం కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో తపాలా సేవలకు ఆదరణ పెరిగింది. లాక్​డౌన్​ కొనసాగుతున్న సమయంలో ప్రజలకు అండగా నిలుస్తోంది తపాలా శాఖ. నిత్యావసర సరకుల నుంచి.. వైద్య పరికరాలు, ఔషధాల డెలివరీ, పింఛను, నగదు ఉపసంహరణ వంటి సేవలు అందిస్తోంది. ఇళ్లవద్దకే సేవల పేరుతో నిత్యం అందుబాటులో ఉంటూ ఆసరాగా నిలుస్తోంది.

#వర్క్​ఫర్​డాక్టర్స్​​..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హనీసింగ్​ అనే వ్యక్తి వైద్యులకు సాయం చేస్తున్నాడు. ట్విట్టర్​ వేదికగా #వర్క్​ఫర్​ డాక్టర్స్​ హ్యాష్​ట్యాగ్​తో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. తమ వంతుగా వైద్యులకు సాయం అందించాలని పిలుపునిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల భువనేశ్వర్​ ఎయిమ్స్​, 45 అసోం రైఫిల్స్​, భోపాల్​లోని సైనికులు సహా వేర్వేరు ప్రాంతాల్లోని సిబ్బందికి పీపీఈ కిట్లు, వైద్య సామగ్రిని తపాలా శాఖ ద్వారా సరఫరా చేశారు హనీసింగ్​. ఒక్క రోజులోనే 160 డెలివరీలు చేశామని..ఇందుకు సహకరించిన ఇండియన్​ పోస్ట్​, ప్రసార, సమచార శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశాడు.

హనీసింగ్​ ట్వీట్​

మామయ్య గొంతు వినిపించిన పోస్ట్​మ్యాన్​..

కర్ణాటక ధార్వాడ్​లో ఉన్న తన మామయ్యతో మాట్లాడేందుకు భారతీయ తపాలా శాఖ ఏవిధంగా ఉపయోగపడిందో ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు అమృత బ్యాట్నాల్​ అనే మహిళ. తపాలా శాఖ, పోస్ట్​మ్యాన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

'ధార్వాడ్​లో ఉన్న మా మామయ్యతో గత వారం రోజులుగా మాట్లాడలేకపోయాం. ఆయన ఫోన్​ పాడైపోయింది. ప్రస్తుతం దానిని బాగు చేయించటం కుదరదని తెలుసు. తపాలా శాఖ మాజీ ఉద్యోగిని అయిన మా తల్లికి ఓ ఉపాయం తట్టింది. పోస్ట్​ ఆఫీస్​కు ఫోన్​ చేసి విషయాన్ని తెలిపింది.

మా మామయ్య ఉండే ప్రాంతంలో సేవలందించే పోస్ట్​మ్యాన్​ ఫోన్​ నంబర్​ తెలుసుకుని అతనికి సమాచారం అందించారు. ఆయన వెంటనే మా మామయ్య ఇంటికి వెళ్లేందుకు అంగీకరించాడు. అక్కడికి వెళ్లి మామయ్య ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ సమయంలో మా అంకుల్​ తనను చూసేందుకు పోస్ట్​మ్యాన్​ ఎందుకు వచ్చాడు అని కాస్త కంగారు పడ్డాడు. మా అమ్మకు ఫోన్​ చేసి మాట్లాడించాడు ఆ తపాలా ఉద్యోగి. కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవటంపై మా మామయ్యనూ మందలించాడు కూడా' అని తెలిపారు అమృత.

అమృత ట్వీట్​

తపాలా శాఖపై కేంద్ర మంత్రి ప్రశంసలు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న సమయంలో ముందుండి ప్రజలకు సేవలందిస్తోన్న తపాలా శాఖకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ట్విట్టర్​ వేదికగా ప్రశంసలు కురిపించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల అవసరాలను భారతీయ పోస్ట్​ ఏ విధంగా తీరుస్తుందో చూడండి అంటూ పోస్ట్​ చేశారు.

రవిశంకర్​ ప్రసాద్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details