అది లద్దాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అబ్బురపరిచాయి. శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... ఈ సైనిక విన్యాసాలను తిలకించారు. ముఖ్యంగా పారాట్రూపర్ల విన్యాసాలు కేంద్ర మంత్రిని మంత్రముగ్ధుడిని చేశాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు విమానం నుంచి దూకిన దృశ్యాలను ఆయన వీక్షించారు.
'లెహ్ సమీపంలోని స్టాక్నాలో పారాడ్రాపింగ్‌తో పాటు భారత సైనికుల ఇతర విన్యాసాలను చూశాను. వారిని కలిసే అవకాశం నాకు దక్కింది. సైనికుల ధైర్యసాహసాలు చూసి నేను గర్వపడుతున్నాను.' రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ మంత్రి.