లద్దాఖ్‌లో సరిహద్దు వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా వెన్నులో వణుకుపుట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది భారత్. ఈ క్రమంలోనే హిందూ మహాసముద్ర జలాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరించి డ్రాగన్‌కు గట్టి హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో భారత్ పంపిన సందేశం చైనాకు చేరిందని.. రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
" గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన ఘర్షణతో చెలరేగిన సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో భారత వైఖరిపై చైనాకు స్పష్టమైన సందేశం పంపేందుకు.. హిందూ మహాసముద్రంలో యుద్ధనౌకలు, జలాంతర్గాములు మోహరించింది భారత నౌకాదళం. సరిహద్దులో పరిస్థితులపై సమన్వయం సహా భారత వైఖరిని చైనా అర్థం చేసుకునేలా చేసేందుకు త్రివిధ దళాల అధినేతలు దాదాపు ప్రతిరోజు చర్చల్లో పాల్గొంటున్నారు. సముద్ర మార్గాల ద్వారా సరఫరా గొలుసులో చైనాకు మలాక్కా జలసంది కీలకం. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఈ జలసంధి చుట్టూ యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరిస్తూ నావికాదళం తన విస్తరణను గణనీయంగా పెంచింది. "