తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరిమితికి మించి ఖైదీలు- కొరవడిన సిబ్బంది

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల పరిస్థితిని జాతీయ నేర గణాంక సంస్థ తన నివేదికలో వివరించింది. మొత్తం 1,350 జైళ్లలో 4.78 లక్షల మంది ఖైదీలు ఉన్నట్లు తెలిపింది. చాలా వరకు జైళ్లు వాస్తవ పరిమితికి మించి పనిచేస్తున్నాయని వెల్లడించింది. మరోవైపు జైళ్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది.

Indian jails remained overcrowded and under-staffed in 2019: NCRB data
పరిమితికి మించి ఖైదీలు- కొరవడిన సిబ్బంది

By

Published : Aug 30, 2020, 3:42 PM IST

దేశంలోని జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్​సీఆర్​బీ) వివరాల ప్రకారం 2019లో చాలా వరకు కారాగారాల్లో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని తేలింది. జైళ్ల వాస్తవ సామర్థ్యం 4.03 లక్షలు ఉంటే.. ప్రస్తుతం 4.78 లక్షల మంది ఖైదీలు ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. ఇందులో 4.58 లక్షల మంది పురుషులు కాగా.. 19,913 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది.

జైళ్ల సామర్థ్యాన్ని 2017లో ఉన్న 3.91 లక్షల నుంచి 2018లో 3.96 లక్షలకు, 2019లో 4.03 లక్షలకు పెంచినట్లు ఎన్​సీఆర్​బీ వివరించింది. 2017లో దేశంలోని కారాగారాలలో 4.50 లక్షల మంది ఖైదీలు ఉండగా.. 2018లో 4.66 లక్షలకు పెరిగినట్లు తెలిపింది.

ఏడాది జైళ్ల సంఖ్య ఆక్యుపెన్సీ రేటు
2017 1,361 115.1 శాతం
2018 1,339 117.6 శాతం
2019 1,350 118.5 శాతం

2019 డిసెంబర్ 31 నాటికి దేశంలో ఉన్న 1,350 జైళ్లలో 617 సబ్​ జైళ్లు, 410 జిల్లా జైళ్లు, 144 సెంట్రల్ జైళ్లు, 86 ఓపెన్ జైళ్లు, 41 ప్రత్యేక, 31 మహిళల, 19 బాల నేరస్థుల సంస్కరణ గృహాలు, రెండు ఇతర జైళ్లు ఉన్నట్లు స్పష్టం చేసింది ఎన్​సీఆర్​బీ.

సెంట్రల్ జైళ్లలోనే అధికంగా..

సెంట్రల్ జైళ్లలోనే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా జిల్లా జైళ్లలో ఆక్యుపెన్సీ రేటు 129.7 శాతంగా ఉంది. ఆ తర్వాత సెంట్రల్ జైళ్లలో 123.9 శాతం, సబ్​ జైళ్లలో 84.4 శాతంగా ఉండగా... మహిళా జైళ్లలో ఆక్యుపెన్సీ రేటు 56.1 శాతంగా ఉంది.

జైలు సామర్థ్యం ప్రస్తుతం ఖైదీల సంఖ్య
సెంట్రల్ జైళ్లు 1.77 లక్షలు 2.20 లక్షలు
జిల్లా జైళ్లు 1.58 లక్షలు 2.06 లక్షలు
సబ్ జైళ్లు 45,071 38,030
ప్రత్యేక జైళ్లు 7,262 -
ఓపెన్ జైళ్లు 6,113 -
మహిళా జైళ్లు 6,511 3,652

సిబ్బంది లేరు!

మరోవైపు జైళ్లను సిబ్బంది కొరత వేధిస్తోంది. 87,599 మంది సిబ్బంది అవసరం ఉండగా.. 2019 డిసెంబర్ 31 నాటికి సామర్థ్యం 60,787గా ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారి హోదా కలిగిన సిబ్బంది(డీజీ/అదనపు డీజీ/ఐజీ, డీఐజీ, ఏఐజీ, సూపరింటెండెంట్) కోసం ప్రభుత్వం 7,239 పోస్టులను మంజూరు చేయగా... ప్రస్తుతం 4,840 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.

వైద్య సిబ్బంది విషయంలోనూ...

72,273 మంది జైలు కేడర్ అధికారులు, 1,307 మంది కరెక్షనల్ స్టాఫ్ అవసరం ఉండగా 2019 చివరినాటికి ఆయా విభాగాల్లో వరుసగా 51,126, 761 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్య సిబ్బంది విషయంలోనూ కొరత కనిపిస్తోంది. 3,320 మంది సిబ్బంది అవసరముండగా... 2019 డిసెంబర్ 31 నాటికి కేవలం 1,962 మంది అందుబాటులో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details