లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
కట్టుదిట్టమైన భద్రత
పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బంగాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.
భాజపాకు కీలకం
చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ. బంగాల్ మినహా మిగతావన్నీ హిందీ రాష్ట్రాలే కావటం విశేషం.