ఇండోనేసియా వరిపైరును భారత్‌లో సాగు చేస్తూ.. ఎందరో అన్నదాతలకు లాభాల బాటచూపాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.
అహ్మద్‌నగర్, మెహందురీకి చెందిన వికాస్ అరోటే మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. కానీ, అనుకోకుండా తన మనసు వ్యవసాయం వైపు మళ్లింది. వ్యవసాయానికి వినూత్నతను, సాంకేతికతను జోడించి ప్రయోగాలు చేయాలనుకున్నాడు. ఇందుకోసం, బంతిపువ్వు విత్తనాలు తెచ్చుకునేందుకు ఓ సారి అసోం వెళ్లాడు. అక్కడే, తనకు నలుపు, నీలి రంగులోని వరి పంట కంటబడింది. వెంటనే అసోం వ్యవసాయ శాఖకు చెందిన రావుసాహేబ్ బింద్రేను సంప్రదించి వివరాలు సేకరించాడు.
ఇండోనేసియాలో విరివిగా పండించే ఈ నీలి రంగు వరి.. భారత్- ఇండోనేసియాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత మన దేశానికి వచ్చిందని తెలుసుకున్నాడు వికాస్. 3 కిలోల నీలి వరి విత్తనాలను మహారాష్ట్రకు తీసుకొచ్చాడు. 5 ఎకరాల్లో వాటిని చల్లి 200 కిలోల విత్తనాలను ఉత్పత్తి చేశాడు. ఆపై, తాను పండించిన విత్తనాలు 20 ఎకరాల్లో సాగు చేసి సత్ఫలితాలు పొందాడు.