తూర్పు లద్దాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచేందుకు భారత్-చైనాలు వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం సహా.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇరుదేశాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
గాల్వన్ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు మంగళవారం, బుధవారం జరిపిన చర్చల్లో సానుకూల ఫలితాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో దఫా చర్చలు నిర్వహించారు.
ఘర్షణ
తూర్పు లద్దాక్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. ఈ నెల ప్రారంభంలోనే భారత్ చైనా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు సైనిక బలగాలు సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలి. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగా.. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.