వాస్తవాధీన రేఖ వెంబడి, లద్దాఖ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాల కోసం... అత్యంత శీతల వాతావారణాన్ని తట్టుకునే గుడారాలను అత్యవసరంగా ఏర్పాటు చేసేందుకు భారత సైన్యం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు భారత్ సైన్యం లద్దాఖ్ సెక్టార్లో 30 వేల మంది అదనపు సైనిక బలగాలను మోహరించింది. కనీసం సెప్టెంబర్- అక్టోబర్ వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికుల కోసం అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకునే గుడారాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి.
చైనాను నమ్మడం కష్టం
ప్రస్తుతం చైనా దళాలు వాస్తవాధీన రేఖ నుంచి తన సైనిక బలగాలను వెనక్కి ఉపసంహరిస్తోంది. అయితే చైనాను నమ్మడం కష్టం కనుక మన సైనిక బలగాలను సరిహద్దుల్లో నిలపడం తప్పనిసరి.
"సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూర్చడం సహా అత్యవసరంగా అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకోగలిగే గుడారాలు ఏర్పాటుచేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం."
- భారత సైనిక వర్గాలు