భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14 (పీపీ-14), పాంగాంగ్ టీఎస్‌ఓ వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. కీలక ప్రాంతాల్లో భారత్-చైనా ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి.
అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న భారత్
చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్ తనకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్ టీఎస్‌ఓ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్ ఆపరేషన్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫింగర్ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్ అదుపులోనే ఉంది. ఆ ప్రాంతంలో చైనా భారీగా దళాలను మోహరిస్తుండగా, అదే స్థాయిలో భారత్ తన శిబిరంలోనూ సైనికులను రంగంలోకి దించుతోంది.
ఎల్‌ఏసీలో ప్రత్యేక దళాలు
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఎలాంటి దురాక్రమణలు చేయకుండా ఉండేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,488 కి.మీ. మేర ఉన్న ఎల్‌ఏఈ వెంబడి ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది.