చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. సరిహద్దు ప్రాంతాల్లో కచ్చితమైన నిఘా కోసం సైన్యం.. భారత్‌లో తయారైన డ్రోన్లను వినియోగించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఈ డ్రోన్లను రూపొందించింది.
పర్వత ప్రాంతాల్లో..
అధిక ఎత్తు ఉన్న ప్రాంతాలు, పర్వతాలతో కూడిన తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నిఘా డ్రోన్లు గస్తీ కాయనున్నాయి. ఈ మేరకు భారత సైన్యం కోరిన విధంగా డీఆర్డీఓ ఈ డ్రోన్లను సమకూర్చినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత్ డ్రోన్లను చంఢీగడ్‌లోని డీఆర్డీఓలో రూపొందించారు.
ప్రపంచంలోనే అత్యంత చురుకైన, తేలికైన డ్రోన్లలో.. భారత్ డ్రోన్లు కూడా ఒకటని రక్షణ వర్గాలు వెల్లడించాయి. వీటిలో పొందుపరిచిన కృత్రిమ మేధ ద్వారా మిత్రులెవరో, శత్రువులెవరో కనిపెట్టవచ్చని పేర్కొన్నాయి.
ఎలాంటి వాతావరణంలో అయినా..
అత్యంత శీతల వాతావరణం, కఠిన పరిస్థితులను తట్టుకుని ఇవి గస్తీ కాస్తాయని డీఆర్డీఓ తెలిపింది. దట్టమైన అడవుల్లో నక్కి ఉన్న మనుషులను కూడా గుర్తిస్తాయని... సైనిక ఆపరేషన్లు జరిగే సమయంలో ఎప్పటికప్పుడు రియల్ టైమ్ వీడియో ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తాయని వెల్లడించింది. రాత్రి వేళల్లోనూ పని చేసేలా నైట్ విజన్ సాంకేతికత ఉందని డీఆర్డీఓ పేర్కొంది. రాడార్‌కు చిక్కకుండా నిఘా నిర్వహించేలా వీటిని రూపొందించారు.
ఇదీ చూడండి:చతుర్భుజి కూటమి నావికాదళం భారత్‌కు బలమేనా?