భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల భద్రతకు అన్ని విధాలా సిద్ధమవుతోంది సైన్యం. తూర్పు లద్దాఖ్‌లో వచ్చే చలికాలంలోనూ పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. యుద్ధ పరిస్థితులను చైనా సృష్టించినట్లయితే.. మెరుగైన శిక్షణ పొందిన, పూర్తి సన్నద్ధతతో, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న భారత దళాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరికలు పంపింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న భారత దళాలతో పోలిస్తే.. చైనా సైనికులు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు చెందినవారని, క్షేత్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొన్న సందర్భాలు లేవని పేర్కొంది.
సరిహద్దులో యుద్ధం వస్తే పోరాడేందుకు భారత దళాలు సిద్ధంగా లేవని, వచ్చే చలికాలంలో పోరాటం చేయలేవని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా మీడియా కథనం నేపథ్యంలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది భారత సైన్యం ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయం.
"చైనా మీడియా అంచనాలు అజ్ఞానానికి ప్రతీక. భారత సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్‌లో చలికాలంలోనూ పూర్తిస్థాయి యుద్ధం చేసే సామర్థ్యానికి మించి ఉన్నాం. భారత్ శాంతికాముక దేశం. పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలనుకుంటుంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకునేందుకే మొగ్గుచూపుతుంది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్న క్రమంలోనే సైనిక సన్నాహాలు కొనసాగుతున్నాయి."