వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధులు కావాలన్నారు.
ఉత్తర, పశ్చిమ సరిహద్దుల నుంచి దేశానికి సవాళ్లు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డ రావత్.. వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించుకోవాలని సూచించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చైనా ఇస్తున్న ఆర్థిక సహాయం, పాకిస్థాన్‌కు చైనా సైనిక, దౌత్య పరంగా మద్దతిస్తోందని రావత్ వెల్లడించారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో అలజడులు సృష్టించడానికి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి.. పాకిస్థాన్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులకైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు త్రివిధ దళాధిపతి.
'ఆ శక్తి మాకు ఉంది...'
చైనా దుకుడు చర్యలను భారత్ చూస్తూనే ఉందని.. వాటిని తిప్పికొట్టే శక్తిసామర్థ్యాలు దేశ త్రివిధ దళాలకు ఉన్నాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రావత్.