భారత్ కీలకమైన బ్లాక్‌టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకొన్నాక పాంగాంగ్ సరస్సు వద్ద చాలా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. సరస్సు దక్షిణ భాగంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా దళాలు ఉత్తర భాగంలో దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. చుషూల్ సబ్ సెక్టార్‌లో బయటకు చెబుతున్న దానికన్నా... తీవ్రస్థాయిలోనే పాంగాంగ్ వద్ద కాల్పులు జరిగాయని ఓ అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారి వెల్లడించినట్లు ‘ఆంగ్లపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంచలన కథనం వెలువరించింది.
ఎప్పుడు జరిగింది..?
భారత్-చైనా దళాలు పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపు ఉన్న ఫింగర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 4 మధ్య ఈ ఘటన చోటు చేసుకొంది. ఇక్కడ కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకొనే క్రమంలో ఇరు వర్గాలు పరస్పర హెచ్చరికలు జారీ చేసుకొనే క్రమంలో 100-200 రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సదరు అధికారి పేర్కొన్నారు.
ఇది బయట ప్రపంచానికి తెలుసా..?
సెప్టెంబర్ 7వ తేదీన చుషూల్ సబ్‌సెక్టార్ వద్ద గాల్లోకి కాల్పులు జరిగాయని ఇరు వర్గాలు ప్రకటనలు చేశాయి. చైనా తాము భారత దళాల స్పందనకు ప్రతి స్పందనగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. భారత్ మాత్రం కాల్పులు జరిపినట్లు ఎక్కడా అంగీకరించలేదు. ఈ ఘటన ముక్పైరీ హైట్స్ వద్ద చోటు చేసుకొంది. చుషూల్ ఘటన తర్వాత పాంగాంగ్ సరస్సు వద్ద కాల్పులపై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్కడ దాదాపు 200 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈఘటన తర్వాత ఇరు దళాల మధ్య దూరం 500 మీటర్ల లోపుగానే ఉంది.
చైనా విదేశాంగ మంత్రి భేటీకి ముందు ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు చెబుతున్నారు. చైనా తీరును గతంలో జరిగిన ఘటనల ఆధారంగా పరిశీలిస్తే.. ఇరు దేశాల చర్చలకు ముందే ఇలాంటి వివాదాలను సృష్టిస్తుంది. ఇది చర్చల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చైనాకు లబ్ధిచేకూరుస్తుందని దాని అంచనా.
వాస్తవానికి పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్4 నుంచి చైనా దళాలు వెనక్కి పోకపోవడంతో భారత దళాలు ఎల్‌ఏసీ లోపలే కీలకమైన శిఖరాలను చైనా బారినపడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి. దీంతో డ్రాగన్ ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. దీనిని ఓర్చుకోలేక చాలా చోట్ల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి అదపు తప్పింది.
అనంతరం మాస్కోలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితిలో కొంత నిలకడ వచ్చింది. అయినా కూడా చైనా దళాలు పాంగాంగ్ సరస్సు వద్ద ఆప్టికల్ కేబుల్స్ వేయడం, దళాలను తరలించడం వంటి చర్యలు చేపడుతూనే ఉన్నాయి.