'రఫేల్' కార్యాలయంలో చోరీకి యత్నం...! ఫ్రాన్స్‌లోని భారత వైమానిక దళానికి చెందిన 'రఫేల్ ప్రాజెక్ట్' కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఎటువంటి కీలక సమాచారమూ ఆ దుండగులకు చిక్కలేదని అధికారులు స్పష్టం చేశారు.
గత ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పారిస్‌కు సమీపంలోని సెయింట్ క్లౌడ్‌లో ఉన్న 'రఫేల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్' కార్యాలయంలోకి ప్రవేశించారు. రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక సమాచారం దొంగిలించాలని ప్రయత్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దుండగులకు ఎలాంటి కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లూ చిక్కలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
అయితే ఈ ఘటనపై భారత రక్షణదళం, రక్షణ మంత్రిత్వశాఖ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఇదీ విషయం..
రఫేల్ ప్రాజెక్ట్ టీమ్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంకు అధికారి సారథ్యం వహిస్తారు. ఈ 36 (రఫేల్) కంబాట్ యుద్ధ విమానాల తయారీ టైమ్‌లైన్‌నూ, భారత వైమానిక దళ సిబ్బంది శిక్షణనూ పర్యవేక్షిస్తారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు సమీపంలో సెయింట్ క్లౌడ్ వద్ద రఫేల్ ప్రాజెక్ట్ కార్యాలయం నెలకొల్పారు. ఇది డసో ఏవియేషన్ కార్యాలయానికి సమీపంలోనే ఉంది. ఇక్కడే భారత భద్రతకు అత్యంత కీలకమైన రఫేల్ యుద్ధవిమానాల సమాచారాన్ని దొంగలించేందుకే తాజాగా విఫలయత్నం జరిగింది.
భారత వైమానికదళాన్ని బలోపేతం చేసేందుకు 2016లో భారత్... ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌తో ఓ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.59,800 కోట్లతో 36 కంబాట్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధమైంది.
ఇదీ చూడండి: తప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌తో కుంగిపోవద్దు: కార్యకర్తలతో రాహుల్