భారత వైమానిక దళం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్‌మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పేర్కొన్నారు. రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేసేందుకు పూర్తి సంసిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే ఏ పోరాటంలోనైనా విజయం సాధించేందుకు ఎయిర్‌ఫోర్స్ కృషి చేస్తుందని తెలిపారు.
లద్దాఖ్‌లో చైనా వాయుసేనతో పోలిస్తే ఎయిర్‌ఫోర్స్ సంసిద్ధతపై అడిగిన ప్రశ్నకు స్పందించారు భదౌరియా. సరిహద్దులో వాయుసేన పటిష్ఠ స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఘర్షణ పరిస్థితి ఎదురైనా.. చైనాకు తమ ఉత్తమ ప్రదర్శన చూపిస్తామని అన్నారు. ప్రపంచంలోని ఉత్తమ వాయుసేనల్లో భారత్ ఒకటని నొక్కిచెప్పారు.
"సరిహద్దులో ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మన సామర్థ్యం పెంచుకోవాలి. యుద్ధక్షేత్రం అంతటా పోరాడే విధంగా బలమైన సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రపంచంలోని ఉత్తమ వాయు సేనలతో కలిసి ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాలు నిర్వహించాం. దీన్ని బట్టి.. ఉత్తమ కార్యాచరణ ఉన్నవారిలో మనం(భారత్) కూడా ఒకరని ధీమాగా చెప్పగలను."
-ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా
రఫేల్ యుద్ధ విమానాల చేరికతో వైమానిక దళ సామర్థ్యం పెరిగిందని అన్నారు ఎయిర్‌చీఫ్ మార్షల్ భదౌరియా. ప్రత్యర్థిపై ముందస్తుగానే కోలుకోలేని దాడి చేసేందుకు రఫేల్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఆధునికీకరణ, శిక్షణ ద్వారా యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం, విశ్వసనీయతను మరింత పెంచుకోవడం ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వావలంబన సాధించేందుకు దేశీయ పరికరాల ఉపయోగం పెంచాలని పిలుపునిచ్చారు.
తేలికపాటి యుద్ధ విమానాల(ఎల్సీఏ)పై పూర్తి నమ్మకం ఉంచినట్లు భదౌరియా పేర్కొన్నారు. రఫేల్ విమానాలతో పాటు, చినూక్, అపాచీ హెలికాఫ్టర్లను ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లు వివరించారు. రికార్డు సమయంలోనే వీటిని అనుసంధానం పూర్తి చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో రఫేల్, ఎల్సీఏ మార్క్ 1 స్క్వాడ్రన్ పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వస్తాయని స్పష్టం చేశారు. అదనంగా 29 మిగ్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్ల కాలంలో 83 ఎల్సీఏ మార్క్1ఏలను వాయుసేనలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి చేస్తున్న స్వదేశీ ఉత్పత్తులపై పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే హెచ్‌టీటీ-40, తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ల కోసం త్వరలోనే కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.