భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో చైనాకు దీటుగా బలగాలను మోహరిస్తోంది భారత్. తూర్పు లద్దాఖ్ సహా సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను పెంచింది భారత వైమానిక దళం. చైనా సరిహద్దులోని వైమానిక స్థావరం వద్ద భారీగా యుద్ధ విమానాలను దించింది వాయుసేన. సుఖోయ్-10ఎంకేఐ, మిగ్-29ఎస్, అపాచీ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ గస్తీ కాస్తున్నాయి.
చైనా సరిహద్దులోని వైమానిక స్థావరంలో రవాణా విమానంతో పాటు అమెరికన్ సీ-17, సీ-130జే, ఐల్యూషిన్-76, ఆంటోనోవ్-32 వంటివి కనిపించాయి. దూర ప్రాంతాల్లోని సైనికులు, యుద్ధ సామగ్రిని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఫార్వర్డ్ పోస్ట్‌లకు తీసుకొచ్చేందుకు వీటిని వినియోగిస్తున్నారు.
ఇండో-చైనా సరిహద్దులోని వైమానిక స్థావరం కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు ఓ ఐఏఎఫ్ వింగ్ కమాండర్.