జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు సంబంధించి పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే. పాకిస్థాన్ ఇప్పటికీ అనాలోచితంగా, సంకుచితంగా వ్యవహరిస్తూ.. కశ్మీర్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు.
పీటీఐ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. హంద్వాడా ఎదురుకాల్పుల్లో స్థానిక ప్రజలను కాపాడేందుకు ఐదుగురు సైనికులు అమరులు అయ్యారని అన్నారు. ఈ ఉగ్రవాద ప్రాయోజిత విధానాన్ని పొరుగుదేశం వదులుకోకపోతే భారత్ సరైన సమయంలో గట్టిగా బదులిస్తుందని హెచ్చరించారు.
"కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచే పాక్‌కు భారత సైన్యం దీటైన జవాబిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు పాకిస్థాన్‌పైనే బాధ్యత ఉంది. వాళ్లు ఈ చర్యలు మానుకోకపోతే సరైన సమయంలో కచ్చితమైన జవాబు ఇస్తాం."
- ఎంఎం నరవాణే, భారత సైన్యాధిపతి
ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి చోటుచేసుకున్న చొరబాట్లను పరిశీలిస్తే కరోనాపై పోరులో పాకిస్థాన్‌కు ఆసక్తి లేనట్లుగానే కనిపిస్తుందని నరవాణే విమర్శించారు. సొంత ప్రజలపై నిర్లక్ష్యం వహించటం వల్లనే ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వైద్య పరికరాలు కొరత ఆ దేశాన్ని తీవ్రంగా వేధిస్తోందన్నారు.
సార్క్ సమావేశంలోనూ పాక్ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైందని నరవాణే వివరించారు. కరోనా నేపథ్యంలో పౌరుల ఆరోగ్యం గురించి కాకుండా కశ్మీర్లో మానవ హక్కులపైన మాట్లాడిందని పేర్కొన్నారు.
"నియంత్రణ రేఖ వద్ద అమాయక పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతూ రోజురోజుకూ తీవ్రత పెంచుతోంది. ఈ చర్యలతో ప్రపంచానికి పాక్ ప్రమాదకారిగా మారుతుంది. తన సొంత పౌరులకు ఉపశమనం కల్గించటంపై ఆ దేశానికి ఆసక్తి లేదు."