తెలంగాణ

telangana

'ఆర్​సీఈపీ'లో భారత్​ చేరితే.. లాభమా? నష్టమా?

By

Published : Nov 2, 2019, 6:38 AM IST

Updated : Nov 2, 2019, 7:15 PM IST

ఏవైనా రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం.. ఆయాదేశాల్లో జరిగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన సుంకాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఈ సుంకాల విషయంలోనే తేడాలు వస్తుంటాయి. వీటిని నివారించడానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉపయోగపడతాయి. కొన్నిదేశాలు కూటమిగా ఏర్పడి ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం సాధారణంగా మారింది. ఇటువంటి వాటిలో 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి' (ఆర్​సీఈపీ) ఒకటి. అయితే ఈ కూటమిలో చేరడం వల్ల భారత్​కు లాభం కన్నా నష్టమే అధికమా?

ఆర్​సీఈపీలో చేరితే.. భారత్​కు భారీ నష్టమే!

'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి' (ఆర్​సీఈపీ)లో ఆసియాకు చెందిన 10 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటితో పాటు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఉన్న 6 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం 16 దేశాలతో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య కూటమిగానే కాక విస్తృత అవకాశాలకు నెలవుగా పేరుపొందింది ఆర్​సీఈపీ. ప్రపంచ జీడీపీలో 34 శాతం.. వాణిజ్యంలో 40 శాతం వాటా కలిగి ఉంది. అంతే కాదు ప్రపంచ జనాభాలో 50 శాతానికి పైగా ఈ దేశాల్లోనే ఉన్నారు. ఈ కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలు అందులోని ఒప్పందాలకు కట్టుబడాల్సి ఉంటుంది. దీనివల్ల భారత్‌కు కలిగే లాభనష్టాలేంటో చూద్దాం.

నవంబరు 4న సమావేశం

ప్రస్తుతం ఆర్​సీఈపీలో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం ఉన్నాయి. వీటితో పాటు చైనా, భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియాలు స్వేచ్ఛా వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమిలోని అధినేతలు నవంబరు 4న బ్యాంకాక్‌లో సమావేశం కానున్నారు. ఆ సదస్సులోనే ఆర్​సీఈపీ సభ్య దేశాల భవిష్యత్‌ ఏంటనేది తేలిపోనుంది.

ఎన్నో ఆందోళనలు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం చర్చలు 2012-–13లో ప్రారంభమయ్యాయి. ఈ నవంబర్‌లో ముగింపు దశకు చేరుకోనున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి భారత్‌ కూడా ఆమోద ముద్ర వేస్తే భవిష్యత్‌లో ఆ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే ఇప్పుడు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణం అవుతోంది. ఆయా దేశాల్లో ఉత్పత్తి వ్యయం, వాటి పరిమాణం విషయానికి వస్తే ఈ కూటమిలో చేరడం వల్ల భారత్‌కు ఏమేరకు లాభం చేకూరనుందన్నదే ఈ విషయంలో చాలామందికి ఉన్న ఆందోళన.

భారత్‌ ఎక్కువగా సేవారంగంపై దృష్టి పెట్టడం వల్ల వస్తు ఉత్పత్తి ప్రధానమైన ఒప్పందాలతో ప్రయోజనాలు తక్కువే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ కాకుండా భారత్‌కు ఇప్పటికే ఆసియా దేశాలతోనేకాక దక్షిణ కొరియా, జపాన్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాల వలన మన దేశానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుతూ వుందన్న అభిప్రాయాలు కూడా బలంగా ఉన్నాయి.

నానాటికీ పెరుగుతున్న వాణిజ్యలోటు

ఇప్పటికే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలున్న దేశాలతో భారత్‌ వాణిజ్య లోటు నానాటికీ పెరిగిపోతూ ఉంది. 2017-18 కి చైనాకు భారత ఎగుమతుల విలువ 13.1 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతుల విలువ 73.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇక్కడ లోటు 63.1 బిలియన్‌ డాలర్లు. దక్షిణకొరియాతో 11.9 ,ఆస్ట్రేలియాతో 10.2, జపాన్‌తో 6.2, న్యూజిలాండ్‌తో 0.29 బిలియన్ డాలర్లు లోటు కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే భారత్‌ ఎగుమతుల విలువ 300 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 461.2 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం వాణిజ్యం 761 బిలియన్ డాలర్లుకాగా లోటు 161.4 బిలియన్‌ డాలర్లు ఉంది.

ఈ నేపథ్యంలోనే భారత్‌ కనుక ఆర్‌సీఈపీలో చేరితే ఇతర సభ్య దేశాల నుంచి దిగుమతయ్యే సరకుల్లో 74-90 శాతంపై సుంకాలు తగ్గించాల్సి వస్తుంది. కొన్నింటిపై తొలగించాల్సి ఉంటుంది కూడా. ఫలితంగా చైనా నుంచి కారుచౌకగా పారిశ్రామిక, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కమ్యూనికేషన్‌ సామగ్రి వచ్చిపడితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు గేట్లు ఎత్తేసినట్లు అవుతుంది. దీనివల్ల 8 కోట్ల మంది భారతీయ పాడి రైతులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తమవుతోంది. 2033 కల్లా భారత్‌లో పాల ఉత్పత్తి 33 కోట్ల టన్నులు కానుండగా, గిరాకీ మాత్రం 29.2 కోట్ల టన్నులకే ఉంటుందని నీతి ఆయోగ్‌ నివేదించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​కే ప్రయోజనం

ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనున్నట్టు తెలుస్తోంది. సముద్ర ఆహారం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల విషయంలో జపాన్‌.. మాంసం, పాల ఉత్పత్తుల విషయంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లు ప్రయోజనం పొందనున్నాయి

స్వదేశీ పరిశ్రమలు దెబ్బతింటాయి!

ఒప్పందం ప్రకారం సుంకాలు తగ్గిస్తే స్వదేశీ పరిశ్రమలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ వస్తువులపై సుంకాలు తగ్గించడానికి అంగీకరించవద్దని రైతులు, పారిశ్రామికవర్గాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. ఆర్‌సీఈపీ నుంచి వ్యవసాయాన్ని మినహాయించాలని రైతు నాయకులు కోరుతున్నారు.

2022కల్లా ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులను నిలిపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌, తన పరిశ్రమల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్‌సీఈపీ వల్ల మన వ్యవసాయం, పాడి, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

Last Updated : Nov 2, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details