సరిహద్దుల్లో బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చైనాను భారత్ హెచ్చరించింది. తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ తన కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసింది.
"బలప్రయోగం, బెదిరింపు ధోరణితో తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడం సరికాదు. ఈ విషయాన్ని చైనా గుర్తించడమే ప్రస్తుత సైనిక ప్రతిష్టంభన పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం. ద్వైపాక్షిక బంధంలో పురోగతి కోసం సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించడం అవసరం. భారత బలగాల సాధారణ గస్తీకి చైనా అవరోధాలు సృష్టించకుండా ఉండాలి. మా కోణంలో చూస్తే ఈ వివాదానికి సూటి పరిష్కారం ఇదే."
- విక్రమ్ మిస్రీ, చైనాలో భారత రాయబారి
ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం
గల్వాన్ లోయ మొత్తం తనదేనన్న చైనా వ్యాఖ్యలను విక్రమ్ మిస్త్రీ కొట్టిపారేశారు. 'వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)లో మా భూభాగంలోనే కార్యకలపాలను సాగిస్తున్నాం. గతంలో ఎలాంటి వివాదం లేని గల్వాన్ ప్రాంతంలో యథాతథ పరిస్థితిని మార్చడానికి చైనా బలగాలు ప్రయత్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది' అని విక్రమ్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే బాధ్యత భారత్‌పైనే ఉందంటూ దిల్లీలోని చైనా రాయబారి సన్ విడొంగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'కొంతకాలంగా చైనా చేస్తున్న కార్యకలాపాల వల్లే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమైంది. ఏప్రిల్, మే నుంచే లద్దాఖ్ సెక్టార్‌లో చైనా అనేక కార్యకలాపాలకు పాల్పడింది. భారత బలగాల సాధారణ గస్తీని అడ్డుకుంది' అని విక్రమ్ చెప్పారు. ఇలాంటి పరిణామాల వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందన్నారు.
రాజ్‌నాథ్‌కు పరిస్థితిని వివరించిన నరవాణే
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిని సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే శుక్రవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు వివరించారు. ఆ ప్రాంతంలో సైనిక సన్నద్ధత స్థాయిని తెలియజేశారు.
ఇదీ చూడండి:తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు