పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓ తప్పుడు మ్యాప్‌ను రూపొందించి.. ఎస్సీఓ(షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్) జాతీయ భద్రతా సలహాదారుల సమవేశంలో ప్రవేశపెట్టింది. ఈ కల్పిత మ్యాప్‌లో.. భారత్‌లోని కొంత భూభాగాన్ని తమ దేశంలోకి చేర్చుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్... సమావేశం నుంచి వాకౌట్ చేసింది.
"రష్యా నేతృత్వంలో జరిగిన ఈ వర్చువల్ భేటీ ద్వారా పాక్ వక్రబుద్ధి మరోమారు బయటపడింది. తన చర్యల ద్వారా సమావేశ నిబంధనలను ఉల్లంఘించింది. రష్యా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన అనంతరం.. సమావేశం నుంచి భారత్ వాకౌట్ చేసింది."
--- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగశాఖ ప్రతినిధి.
ఇదీ చూడండి:-కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... సభ్య దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను భద్రపరచడం ఎస్సీఓ నిబంధనలో ముఖ్యమైనది. దీనికి పాక్ తూట్లు పొడిచింది. ఈ అక్రమ మ్యాప్‌ను పాక్ ఉపయోగించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వైఖరిని మార్చుకోవాలని రష్యా కూడా పాక్‌కు విజ్ఞప్తి చేసింది.
పాకిస్థాన్ ప్రధానికి జాతీయ సలహాదారు మోయిద్ యూసఫ్, రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి నికోలియా పాట్రోషెవ్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.
ఈ ఘటన అనంతరం.. భారత్‌తో రష్యా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. పాక్ చర్యలకు తాము మద్దతివ్వడం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇరు దేశాల బంధానికి ఇది అడ్డుగా మారకూడదని పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:-'సొరంగాల ద్వారా ఉగ్రవాదులు- డ్రోన్లతో ఆయుధాలు'