అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్‌తో కీలక చర్చలకు సిద్ధమయ్యారు. దిల్లీలో 2+2 పద్ధతిలో జరిగే సమావేశాల్లో ఇరు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మంత్రులు తమకు సమాన హోదా కలిగిన వ్యక్తులతో భేటీ అవుతారు. భారత్ తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రక్షణ పరమైన అంశాలు, విదేశాంగ విధానాలపై సమావేశంలో ఎక్కువగా చర్చిస్తారు.
జపాన్ తరహాలో..
జపాన్ కీలకమైన దేశాలతో చర్చలకు ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, భారత్‌తో ఈ విధానాన్నే ఉపయోగిస్తోంది. భారత్ కూడా అమెరికా, జపాన్‌లతో మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు జరుపుతుంది. ఆస్ట్రేలియాతో మాత్రం కార్యదర్శుల స్థాయిలో వీటిని నిర్వహిస్తోంది. ఇండో పసిఫిక్‌లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్చలు సాగుతాయని విశ్వసిస్తున్నానని.. పాంపియో ట్వీట్ చేశారు.
బెకా ఒప్పందంపై సంతకాలు!
ఈ భేటీలో లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల భారత్ భద్రతాపరమైన అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య పరస్పర అవసరాల కోసం సమన్వయం పెంచుకోవడం.. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై దృష్టిపెట్టడం ఈ చర్చల ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. పాంపియో, ఎస్పర్ తమ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తోనూ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు చెందిన ఉపగ్రహాలు, సెన్సార్లు ప్రపంచవ్యాప్తంగా సేకరించే కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకొనేలా బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్(బెకా)పై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.