అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, సెనేటర్ కమలా హారిస్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా శుభాకాంక్షలు తెలిపారు. వారి విజయాన్ని అభినందిస్తూ విడివిడిగా లేఖలు రాశారు. బైడెన్, హారిస్ నేతృత్వంలో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతమవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో బైడెన్ చేసిన ప్రసంగాలను కొనియాడిన సోనియా... ప్రజలకు తనపై నమ్మకం కలిగించడానికి తీవ్రంగా శ్రమించారన్నారు.
"మీ ప్రసంగాలు, ప్రజల్లో ఏర్పడిన వర్గ విభేదాలను నయం చేసేందుకు మీరు పడిన శ్రమ, లింగ, జాతి సమానత్వం ద్వారా ఎంతో స్ఫూర్తి పొందాము" అని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. బైడెన్ నాయత్వంలో కేవలం మన ప్రాంతంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో శాంతిస్థాపన జరగాలని, అన్నిదేశాలూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.