భారతదేశాన్ని అమెరికా ఎంతగానో ప్రేమిస్తుందని, గౌరవిస్తుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ మోటేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో జనసంద్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
భారత సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవాలు, చట్టాలు, సర్వమత సమానత్వాన్ని ట్రంప్ కొనియాడారు. ఇరుదేశాల రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని ఉద్ఘాటించారు ట్రంప్.
"ఉగ్రవాదులను అడ్డుకుని, వారి సిద్ధాంతాలపై పోరాడటానికి అమెరికా-భారత్ కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయమై.. నేను అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి మా అధికార యంత్రాంగం పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతోంది. పాక్‌తో కలిసి ఉగ్రవాద సంస్థలను అరికట్టి, ఆ దేశ సరిహద్దు కేంద్రంగా పనిచేసే ఉగ్రమూకలను తరిమికొట్టే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో సానుకూల స్పందనలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. ఈ విషయంలో భారత్ నాయకత్వ పాత్ర ఎంతో అవసరం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
రక్షణ రంగంపై...
ఇరుదేశాల మధ్య జరగబోయే రక్షణ ఒప్పందాలను ట్రంప్ ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా నిలుస్తుందన్నారు.