నేటి నుంచి భారత్-అమెరికా మధ్య వాషింగ్టన్లో రెండో దఫా 2+2 చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయ్శంకర్లు ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్తో ఇరువురు నేతలు 2+2 చర్చలు జరపనున్నారు. చర్చల్లో భాగంగా విదేశాంగ విధానంపై సమగ్ర సమీక్ష సహా భద్రతా, రక్షణ సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమాలోచనలు జరపనున్నారు. మానవ హక్కుల అంశం ఇందులో లేనప్పటికీ పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
దేశంలో తీవ్రరూపం దాల్చుతున్న పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు, ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో పరిస్థితులు తదితర అంశాలు ఈ కీలక చర్చలపై ప్రభావం చూపుతాయో లేదా వేచి చూడాలి. అయితే కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత సమాచార వ్యవస్థపై నిషేధాజ్ఞలు, రాజకీయ నేతల నిర్బంధంపై ఇప్పటికే రెండు సార్లు అమెరికా చట్టసభ చర్చించడం గమనార్హం.