ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. వైరస్ వ్యాప్తి అడ్డుకోవాలంటే ఈ తరహా చర్యలు అనివార్యమన్నారు.
"ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాం. 21 రోజులపాటు ఆంక్షలు కొనసాగుతుంది. ఈ లాక్‌డౌన్ నిర్ణయం.. ప్రతి ఇంటికీ లక్ష్మణరేఖ లాంటిది. కరోనా నివారణలో రానున్న 21 రోజులు చాలా కీలకం. కరోనాను అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే తర్వాత మనచేతుల్లో ఏమీ ఉండదు. ఇంటినుంచి బయటకు వెళ్లాలనే యోచన కొన్నాళ్లపాటు మానుకోండి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఏం జరిగినా..
దేశంలో ఏం జరిగినా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు మోదీ. ప్రధాని నుంచి గ్రామీణుల వరకు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించి కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రాణాల కన్నా ఎక్కువనా?
21 రోజుల పాటు విధించే ఈ లాక్‌డౌన్.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిని భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందన్న విషయాన్ని మోదీ ఉదహరించారు.