తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదాతి దళాలకు అధునాతన తుపాకులు - make in india modern guns manufacturing

తూర్పు లద్దాఖ్​లో చైనాతో సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో పదాతి దళ సైనికులకు అధునాతన ఆయుధాలను సమకూర్చేందుకు భారత్ కసరత్తు ముమ్మరం చేసింది. అసాల్ట్​ రైఫిళ్లు, దగ్గర నుంచి శత్రువుతో పోరాడేందుకు క్లోజ్​ క్వార్టర్​ బ్యాటిల్(సీక్యూబీ) కార్బైన్​ తుపాకులు, తేలికపాటి మర తుపాకుల (ఎల్​ఎంజీలు )ను కొనుగోలు చేయనుంది.

india -to-buy-new -modern-guns -from-america
పదాతి దళాలకు అధునాతన తుపాకులు

By

Published : Oct 19, 2020, 11:19 AM IST

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నుంచి 72 వేల సిగ్ సావర్​ అసాల్ట్ రైఫిళ్లు, క్లోజ్​ క్వార్టర్​ బ్యాటిల్(సీక్యూబీ) కార్బైన్​ తుపాకుల కొనుగోలుకు డిసెంబర్​ లోగా భారత్​ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. పదాతి దళ సైనికులకు ఈ తుపాకులే ప్రధాన ఆయుధాలు. వీటిని సమకూర్చే ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలు వంటి భారీ ఆయుధాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ ఈ తుపాకుల అంశాన్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 12లక్షల మందితో కూడిన మన సైన్యంలో 380 పదాతి దళ, 63 రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్లు ఉన్నాయి. మొత్తం మీద భారతసేనకు 9.5 లక్షల అసాల్ట్​ రైఫిళ్లు, 4.6 సీక్యూబీ కార్బైన్లు, 57వేల ఎల్​ఎంజీలు అవసరం. అత్యవసర కొనుగోళ్ల కింద కొన్ని తుపాకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతావాటిని విదేశీ సహకారంతో 'భారత్​లో తయారీ' కింద స్థానికంగానే ఉత్పత్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

'భారత్​లో తయారీ'లో భాగంగా..

⦁ చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నుంచి 72వేల సిగ్ సావర్​ అసాల్ట్ రైఫిళ్ల కొనుగోలుకు డిసెంబర్​ లోగా భారత్​ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. సరిహద్దుల్లో మోహరించిన బలగాల కోసం ఇప్పటికే 72,400 సిగ్ సావర్​ తుపాకులను రూ.647 కోట్లు వెచ్చించి సమకూర్చింది. 'సత్వర కొనుగోలు ప్రక్రియ ' కింద ఈ ప్రక్రియను చేపట్టింది. 'భారత్​లో తయారీ' కింద ఉత్తర్​ ప్రదేశ్​లోని కోర్వా ఆయుధ కర్మాగారంలో ఏడు లక్షల ఏకే-203 అసాల్ట్​ రైఫిళ్లను రష్యా సహకారంతో ఉత్పత్తి చేసేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. అది ప్రస్తుతం నిలిచిపోయింది. దీన్ని తిరిగి పట్టాలెక్కించాలని సైన్యం కోరుతోంది.

⦁ ఇజ్రాయెల్​ నుంచి రూ. 880 కోట్లతో 16,479 'నెగెవ్​' ఎల్​ఎంజీలను కొనుగోలు చేయటానికి ఈ ఏడాది మార్చిలో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే జనవరి నుంచి ఈ ఆయుధాలు మన సైన్యానికి అందుతాయి. మిగతా ఎల్​ఎంజీలను దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు ఐదు విదేశీ కంపెనీలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

⦁ 4.6లక్షల సీక్యూబీ కార్బైన్లను దేశంలో ఉత్పత్తి చేసేందుకు వచ్చే ఏడాది ఆరంభంలోనే సైన్యం ప్రతిపాదనలను భారత్ కోరనుంది. ఇప్పటికే దీనిపై ఐదు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపాయి. ఆ సంస్థలు.. ప్రభుత్వ రంగంలోని ఆయుధ కర్మాగార బోర్డు లేదా ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

వేడుకలకు కోత :

వనరులను సమర్థంగా వాడుకోవటంలో భాగంగా పొదుపు చర్యలు చేపట్టాలని సైన్యం భావిస్తోంది. ఈ మేరకు ఏటా జనవరి 15న సైనిక దినోత్సవం, అక్టోబరు 9న ప్రాదేశిక సైనిక వేడుకలను నిలిపివేయాలని ఒక అంతర్గత కమిటీ సూచించింది. ఈ నెల 26నుంచి జరిగే సైనిక కమాండర్ల సదస్సులో వీటిపై నిర్ణయం తీసుకునే వీలుంది. సదరు కమిటీ చేసిన మరికొన్ని సూచనలివీ..

  • ఏటా గణతంత్ర దినోత్సవం, బీటింగ్​ రిట్రీట్​ కార్యక్రమాల్లో ఉపయోగించే సైనిక బ్యాండ్లను 30నుంచి 18కి తగ్గించాలి.
  • జులై 26న కార్గిల్​ విజయ్​ దివస్, డిసెంబర్​ 16న విజయ్​ దివస్​లను ఆర్భాటాలు లేకుండా జరపాలి. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక కేంద్రాలన్నింటిలో వీటిని జరుపుకోవటానికి బదులు రాష్ట్రపతి భవన్​లోనే నిర్వహించాలి.
  • శాంతియుత ప్రాంతాల్లో ఉండే బహుళ 'ఆఫీసర్స్​ మెస్​'లను విలీనం చేసి, ఒక్క మెస్​నే నిర్వహించాలి.
  • లాంఛనాల్లో భాగంగా ఉన్నతాధికారులకు ఎస్కార్టుగా సైనిక పోలీసులు వెళ్తుంటారు. ఈ ఆనవాయితీని కొన్ని వేడుకలకే పరిమితం చేయాలి.
  • సైనిక ఉన్నతాధికారుల ఇళ్ల వద్ద మోహరించే భద్రతా సిబ్బంది సంఖ్యను గరిష్ఠంగా నాలుగుకు కుదించాలి. లెఫ్టినెంట్​ జనరల్, ఆపై స్థాయి అధికారులకే ఈ సౌకర్యాన్ని కల్పించాలి.

పంపిణీ ఎప్పుడు ?

తూర్పు లద్దాఖ్​లో చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి 50వేల మందికిపైగా భారత సైనికులు మోహరించారు. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 25డిగ్రీల సెల్సియస్​కు చేరాయి. వీటిని తట్టుకోవటానికి సైనికులకు ప్రత్యేక దుస్తులు అవసరం.

అయితే వీటిని అమెరికా నుంచి ఆగమేఘాల మీద దిగుమతి చేసుకున్నప్పటికీ సైనికులకు అందజేయటంలో జాప్యం జరుగుతోంది. మొత్తం 30వేల జాకెట్లకు ఆర్డరివ్వగా, ఈ నెల 2న మొదటి విడత కింద 15వేలు జాకెట్లు అందాయి. రెండు వారాలుగా అవి దిల్లీలోని సైనిక డిపోలోనే ఉన్నాయి.

ఈ జాకెట్లు మూడు పొరలను కలిగి ఉంటాయి. తల భాగాన్ని కప్పేసే హూడీ సైతం ఉంటుంది. వీటి బరువు చాలా తక్కువ. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఈ కొండ ప్రాంతంలో ఇది సైనికులకు చాలా ఊరట కలిగిస్తుంది.

ఈ జాకెట్​ లోపలి పొర ఉన్నితో తయారైంది. దానిపైన పాలిస్టర్ పొరలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details