తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై అప్రమత్తత..భద్రత కట్టుదిట్టం

అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశమంతటా పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, మధ్యప్రదేశ్‌లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయా ప్రభుత్వాలు ఉన్నతాధికారులను ఆదేశించాయి.

By

Published : Nov 10, 2019, 5:11 AM IST

అయోధ్య తీర్పు: దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై శనివారం చారిత్రక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. తీర్పు నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తీర్పు సందర్భంగా విధించిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతర పహారా కాస్తున్నాయి బలగాలు.

అయోధ్యలో ముూడంచెల భద్రత..

దేశ చరిత్రలోనే కీలకంగా భావిస్తున్న అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రామ జన్మభూమి, అయోధ్య ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. అయోధ్య నగర శివారుల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ముందు నుంచే అయోధ్యలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

యూపీలో ప్రశాంతం..

అయోధ్య తీర్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. శాంతిభద్రతలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించటంతో పాటు పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నాయి. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా తొలిసారిగా అత్యవసర ఆపరేషన్‌ కేంద్రం-ఈవోసీ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పరిశీలించి...శాంతి భద్రతల గురించి ఆరా తీశారు. యూపీలో 31 జిల్లాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. అన్ని జిల్లాల్లో తాత్కాలిక జైళ్లు ఏర్పాటు చేశారు. అలీగఢ్‌ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలపై 24 గంటల పాటు నిషేధం విధించారు.

వివిధ రాష్ట్రాల్లో..

యూపీతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోనూ కొన్ని చోట్ల నిషేధాంక్షలు విధించారు. సెక్షన్‌ 144 అమలు చేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గుజరాత్‌లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. ఆర్థిక రాజధాని ముంబయిలోనూ పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. 40 వేల మంది పోలీసుల పహారా కాస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తామని పోలీసులు తెలిపారు.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌...ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. భరత్‌పూర్‌ సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6గంటల వరకు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం తెలిపింది. జైసల్మేర్‌లో ఈ నెల 30వరకు సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు వెల్లడించింది.

పంజాబ్, హరియాణాల్లో ఉన్నతాధికారులు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. హై అలర్ట్‌ ప్రకటించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు హెచ్చరించారు. దేశ రాజధాని దిల్లీలోనూ సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. జామా మసీదుతో పాటు పాతదిల్లీ ప్రాంతాల్లో భద్రత మరింత పెంచారు. వదంతులు వ్యాప్తి చేసినందుకు గానూ...నోయిడాలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలో 70 కర్ణాటక రిజర్వ్‌ పోలీసు బృందాలు, రెండు పారామిలిటరీ బలగాలు బెంగళూరు, మంగళూరులో పహారా కాస్తున్నాయి.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు దృష్ట్యా దేశవ్యాప్తంగా పటిష్ఠ భద్రత

ABOUT THE AUTHOR

...view details