తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కే4: నీటిలో నుంచే శత్రువులకు భారత్​ బదులు!

కే4... భారత్ ఇటీవల​ దిగ్విజయంగా ప్రయోగించిన క్షిపణి. సముద్రం లోపల నుంచి దూసుకొచ్చి... శత్రువును తుత్తునియలు చేయడం కే4 ప్రత్యేకత. ఈ విజయంతో భారత్​ సంతృప్తి చెందవచ్చా? రక్షణపరంగా అమెరికా, రష్యా, చైనా సరసన నిలవాలంటే ఇది సరిపోతుందా?

india-tests-k4-submarine-launched-ballistic-missile
ఆపరేషన్​ కే4: నీటిలో నుంచే శత్రువులకు భారత్​ బదులు!

By

Published : Jan 22, 2020, 7:45 PM IST

Updated : Feb 18, 2020, 12:49 AM IST

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే4 బాలిస్టిక్​ క్షిపణిని జనవరి 19న విశాఖ సముద్ర తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించినట్లు అధికారిక ప్రకటన రాకున్నా... ప్రభుత్వ వర్గాలు విజయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అన్ని సాంకేతిక పారామితులనూ కచ్చితత్వంతో అందుకున్నట్లు సమాచారం.

సముద్రంలో ఉండే జలాంతర్గామి నుంచి కే4 క్షిపణిని ప్రయోగించగా.. అది 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. సముద్ర తలం నుంచి అణుక్షిపణులను ప్రయోగించగల దేశంగానూ అవతరించింది భారత్​. ఈ క్షిపణులను డీఆర్​డీఓ పరిధిలోని డీఆర్​డీఎల్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అమెరికా, రష్యాలే ముందు...

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణులను సొంత పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేసే సామర్థ్యం అమెరికా, రష్యాకు ఎప్పటినుంచో ఉంది. ప్రపంచదేశాలకు దశాబ్దాల కిందనే తమ సత్తా చూపాయి. 1980ల్లో ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో ఈ రెండు దేశాలు దుర్భేధ్యమైన ఎస్​ఎల్​బీఎం(జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణి), ఎస్​ఎస్​బీఎన్​(జలాంతర్గాముల నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణి)లను అభివృద్ధి చేశాయి. వీటిని అత్యంత రహస్యంగా ప్రయోగించాయి. 100 మీటర్లలోపు సీఈపీ(కచ్చితత్వానికి కొలమానం)తో.. దాదాపు 12 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వీటి సొంతం.

చైనాకు కూడా మెరుగైన ఫలితాలు...

ఆ తర్వాత.. యూకే, ఫ్రాన్స్​ మధ్యస్థాయి అణ్వాయుధ శక్తులున్న దేశాలుగా పేరు పొందాయి. చైనా.. అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యమున్నట్లు 1964 అక్టోబర్​లో ప్రకటించింది. 1982 అక్టోబర్​లో తొలిసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణి(ఎస్​ఎల్​బీఎం) పరీక్షను నిర్వహించింది. జేఎల్​-1గా పిలిచే ఈ మిస్సైల్​.. 1700 కి.మీ. సుదూర లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ మధ్య దశాబ్దాలలో చైనా ఇదే తరహా ప్రయోగాలను చెప్పుకోదగ్గ స్థాయిలో చేసి.. నీటి లోపల తన శక్తిని చాటుకుంది.

2018 నవంబర్​లో 9 వేల కి.మీ. పరిధిలో లక్ష్యాలను అధిగమించేలా.. చైనా జేఎల్​-3 అనే మరో క్షిపణిని ప్రయోగించింది. జేఎల్​-1 క్షిపణిని పడవకు జతచేస్తూ అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో పనిచేసే ఈ మిస్సైల్​.. 2025 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనుంది.

ఇదే సరైన సమయం...

తాజాగా కే4 బాలిస్టిక్​ క్షిపణి విజయవంతం అయిన ఉత్సాహంలోనే భారత్​.. నీటి అడుగున అణు నిరోధకతను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలోనే 2018 నవంబర్​లో జలాంతర్గామి ప్రయోగాల్లో భారత్​ ప్రవేశంపై... ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్​ను గుర్తుకుతెచ్చుకోవాలి.

''భారత్​కు గర్వకారణం. అణు జలాంతర్గామి ఐఎన్​ఎస్​ అరిహంత్​ తన మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. ''

- 2018లో మోదీ ట్వీట్​.

నీటిలో నుంచి కూడా శత్రువును ఎదుర్కోగల దేశమన్న గుర్తింపు భారత్​కు లభించింది. ఐఎన్​ఎస్​ అరిహంత్​కు అమర్చిన క్షిపణి ఎంతో విశ్వసనీయమైంది. అయితే... సామర్థ్యం 750 కిలోమీటర్లే. అందుకే మరింత దూరాన ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగేలా కే4 సామర్థ్యాన్ని పెంచడం ఇప్పుడు అవసరం.

అరిహంత్​ మొదటి దశ ప్రయోగ సమయంలో... నావికాదళ మాజీ అధిపతి, స్టాఫ్​ కమిటీ చీఫ్​(సీఓఎస్​సీ) అడ్మిరల్​ అరుణ్​ ప్రకాశ్​ ఓ విషయాన్ని గుర్తు చేశారు.

''జలాంతర్గాముల్లో అణ్వాయుధాలతో బాలిస్టిక్​ క్షిపణులను కలిగి భారత్​.. శత్రువులకు బలమైన హెచ్చరికలు చేస్తుంది. నీటి లోపల శత్రు దుర్భేధ్యంగా ఉండొచ్చు. నీటి అడుగున బలమైన శక్తితో.. ఇది భారత్​ ప్రతిష్ఠను మరింత పెంచేదే. అయితే.. జలాంతర్గామి అణ్వాయుధ బాలిస్టిక్​ క్షిపణులను.. ఖండాంతర పరిధిలో ప్రయోగించాల్సిన సామర్థ్యం ఎంతో అవసరం. తద్వారా అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి శత్రువులకు గట్టి హెచ్చరికలు చేయవచ్చు.''

- అరుణ్​ ప్రకాశ్​, నావికాదళ మాజీ అధిపతి

చిన్నదే అయినా గట్టి సందేశం..

జనవరి 19న భారత్​ ప్రయోగించిన 3500 కి.మీ. పరిధి లక్ష్యాలను ఛేదించే కే4 పరీక్ష చిన్నదే కావచ్చు... కానీ సుదూర ఆశయం దిశగా పయనించేందుకు ఇది సరైన అడుగుగా చెప్పవచ్చు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణులను ధ్వంసం చేయడం ప్రపంచంలోని ఏ శక్తిమంతమైన సైన్యానికైనా కష్టసాధ్యమే. ఆ లక్ష్యంతోనే ఈ తరహా ప్రయోగాలను భారత్​ మరింత పెంచాల్సిన అవసరముంది.

ఉపరితలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణులు... రెండు మాధ్యమాల్లోనే(ఉపరితలం, అంతరిక్షం) పయనిస్తే సరిపోతుంది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణులు 3 మాధ్యమాల్లో దూసుకెళ్లాల్సి ఉంటుంది.

ఎన్నో సవాళ్లున్నా.. సాధించాలి

  • జలాంతర్గామి ప్రయోగాల్లో మొదట.. క్షిపణి నీటి గుండా ప్రయాణించాలి. అనంతరం.. భూమి ఉపరితలం మీదుగా పారాబోలిక్​ పథంలో పయనించాలి. ఆ తర్వాత అంతరిక్ష మాధ్యమంలోకి ప్రవేశిస్తుంది. తుది లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేలాది కిలోమీటర్లు పయనించి.. తిరిగి భూమిని చేరుతుంది.
  • ఇది సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎన్నో పారామితులను సమన్వయం చేయాల్సి ఉంటుంది. భారీ క్షిపణిని ప్రయోగించడం.. జలాంతర్గామి స్థిరత్వంపైనా ప్రభావం చూపుతుంది.

తదుపరి లక్ష్యాలపై వ్యూహాలు...

జనవరి 19న నిర్వహించిన కే4 క్షిపణి ప్రయోగం రెండో దశను అతి త్వరలో పరీక్షించే అవకాశముంది. అరిహంత్​ రెండో ఓడ నుంచి క్షిపణి ప్రయోగించడమే తర్వాతి సవాల్​. అయితే.. ఇతర దేశాల ప్రయోగాల్ని బట్టి చూస్తే జలాంతర్గాముల నుంచి బాలిస్టిక్​ క్షిపణుల్ని సుదూర లక్ష్యాలకు ప్రయోగించడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని అర్థమవుతోంది.

అప్పటివరకు నీటి అడుగున(సముద్రం లోపల) భారత్​.. శత్రు దుర్భేధ్యంగా మారుతుందన్న ఆశను సజీవంగా ఉంచాలి. గొప్ప సంకల్పానికి దేశం దగ్గరలోనే ఉందని ప్రజల్లో నమ్మకం కల్పించాలి. అన్ని విధాలా అవసరమైన ఆర్థిక వనరులను అందించడం ప్రభుత్వ బాధ్యత.

(రచయిత- సి. ఉదయ్​ భాస్కర్​)

Last Updated : Feb 18, 2020, 12:49 AM IST

ABOUT THE AUTHOR

...view details