తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2020, 5:30 AM IST

ETV Bharat / bharat

కొవిడ్​ రికవరీల్లో భారత్​యే టాప్​.!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారిలో ఎక్కువ మంది భారత్​లో ఉన్నారు. కొత్తగా నమోదువుతోన్న కేసుల సంఖ్యతో పోలిస్తే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా రెండు మాసాల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య మూడు రెట్లుకు పడిపోయింది.

India stands top in the list of covid 19 recovery cases in the world
కొవిడ్​ రికవరీల్లో భారత్​నే టాప్​.!

కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల్లో క్రియాశీల కేసుల సంఖ్య మూడు రెట్లు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారత్‌, బ్రెజిల్‌లోనే అత్యధిక రికవరీ..

భారత్‌లో ఇప్పటివరకు 82 లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 75లక్షల 44వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 91.68 శాతంగా ఉంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికాలో మొత్తం 92లక్షల కేసులు నమోదుకాగా వీరిలో కేవలం 36లక్షల మంది మాత్రమే కోలుకున్నారు. ఇక్కడ కొవిడ్‌ కారణంగా మరణిస్తున్న వారిసంఖ్య అధికంగా ఉంది. యూరప్‌ దేశాల్లోనూ వైరస్‌ బారినుంచి కోలుకుంటున్న వారిసంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫ్రాన్స్‌లో 14లక్షల కేసులు బయటపడగా వీరిలో కేవలం లక్షా 23వేల మంది మాత్రమే కోలుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక స్పెయిన్‌లోనూ 12లక్షల కొవిడ్‌ రోగుల్లో లక్షా 50వేల మంది రికవరీ అయ్యారు. యూకేలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఒక్క జర్మనీలో మాత్రం వైరస్‌ నుంచి కోలుకునే వారిసంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. ఇక మెక్సికోతోపాటు దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్‌, అర్జెంటీనా, పెరూ, చిలీ దేశాల్లో రికవరీ సంఖ్య మెరుగుగానే ఉంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు మొత్తం 55లక్షల కేసులు నమోదుకాగా వీరిలో 50లక్షల మంది కోలుకున్నారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల 66లక్షల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో ఇప్పటికే 3కోట్ల 11లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచ రికవరీల్లో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

భారత్‌లో మూడు రెట్లు తగ్గిన క్రియాశీల కేసులు..

ప్రస్తుతం భారత్‌లో 5లక్షల 61వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఆరు లక్షలకు దిగువగా ఉండటం వరుసగా ఇది నాలుగో రోజు. కాగా, ఇది మొత్తం కేసుల్లో 6.83శాతం మాత్రమే. ఇక సెప్టెంబర్‌ 3న 21శాతంగా ఉన్న క్రియాశీల కేసులు ప్రస్తుతం ఆరుశాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన రోజు నుంచే నిర్ధారణ పరీక్షలను భారీ స్థాయిలో చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దీంతో ఇప్పటివరకు 11కోట్ల టెస్టులను పూర్తిచేశామని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2037 కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే వైరస్‌ కట్టడి సాధ్యమవుతోందని వెల్లడించింది. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన జూన్‌ నెల నుంచి దేశంలో కరోనా రికవరీ తీరు ఇలా ఉంది.

ఇదీ చూడండి: దేశంలో 82 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details