పాకిస్థాన్... పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణం చేట్టడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆక్రమించిన భారత భూభాగంలో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాక్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను భారత్ ఖండించింది.
చైనా సహకారంతో... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుధవారం గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని చిలాస్ వద్ద డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
"పీఓకే సహా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు... భారత్‌లో అంతర్భాగం. అందువల్ల ఇక్కడ పాకిస్థాన్ అక్రమ నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది."
- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
పాక్- చైనా ఒప్పందం
డైమర్- భాషా ఆనకట్ట నిర్మాణం కోసం పాకిస్థాన్- చైనాలు 442 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాకిస్థాన్ అక్రమ ప్రాజెక్టుకు చైనా సహకారం అందించడం సరికాదని భారత్ అభ్యంతరం తెలిపింది.