జమ్ముకశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా, పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. కశ్మీర్ అంశానికి సంబంధించి చైనా, పాక్ చేసిన సంయుక్త ప్రకటన తర్వాత ఈ విధంగా సమాధానమిచ్చింది భారత్.
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వి బీజింగ్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. కశ్మీర్‌కు సంబంధించి తాజా పరిణామాలపై చైనాకు పాక్ వివరించింది. దీనిపై స్పందిస్తూ జమ్ముకశ్మీర్ విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చైనా, పాక్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని మరోసారి పొరుగుదేశాలకు స్పష్టం చేశారు.