మరణ శిక్ష రివ్యూ పిటిషన్ కుల్భుషణ్ జాదవ్ తిరస్కరించారని పాక్ చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. జాదవ్ తన హక్కులను వదులుకునేందుకు పాక్ బలవంతంగా చేస్తోన్న కుట్ర అని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. కుల్‌భూషణ్ విషయంలో పాక్ బూటకపు ప్రకటనలు చేస్తోందని మండిపడింది.
"తన కస్టడీలో ఉన్న జాదవ్ రివ్యూ పిటిషన్‌ను వేసేందుకు నిరాకరించాడని పాక్ నాలుగేళ్లుగా చెబుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరిస్తున్నామనే ముసుగులో తన దుష్ట ప్రయత్నాలు నెరవేర్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. పరిష్కారం చూపిస్తున్నామనే భ్రమను కల్పిస్తోంది. జాదవ్‌ను రక్షించి దేశానికి తీసుకొచ్చేందుకు భారత్ శాయశక్తులా కృషి చేస్తుంది."
- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
బలవంతంగా ఒప్పించారు..
ఐసీజే తీర్పును పాటిస్తున్నాం అంటూనే పాకిస్తాన్ అబద్ధాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అనురాగ్ ఆరోపించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్, సాక్ష్యాలు, కోర్టు ఉత్తర్వులతో సహా సంబంధిత పత్రాలను భారత్‌కు ఇవ్వడానికి పాక్ నిరాకరించిందని చెప్పారు.
"పాక్ అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తోందని ఇప్పటికే ఐసీజే ఆరోపించింది. గతంలో కుట్రపూరితంగా విచారించి జాదవ్‌కు మరణశిక్ష విధించారు. ఇప్పటికీ ఆయన పాక్ సైన్యం కస్టడీలోనే ఉన్నారు. రివ్యూ పిటిషన్‌ను దాఖలుకు నిరాకరించేలా జాదవ్‌పై ఒత్తిడి చేశారని కచ్చితంగా చెప్పగలం."
- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి