భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చిరకాలం గుర్తుండిపోయే విధంగా అద్భుత ఆతిథ్యం ఇచ్చింది భారత్. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభ్భాయ్ పటేల్ విమానాశ్రయంలో భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి విమానం దిగిన ట్రంప్‌ను హత్తుకుని సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం ఇరువురు నేతలు ఎర్ర తివాచీపై హుందాగా నడుస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించారు.
షెడ్యూలు కన్నా ముందే..
ఉదయం 11:40 గంటలకు అధికారిక షెడ్యూల్ ఉండగా మూడు నిమిషాల ముందే 11:37 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంది అధ్యక్షుడి విమానం ఎయిర్‌ఫోర్స్ వన్. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక, అల్లుడు జరెడ్ కుష్నెర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
రోడ్ షోలో జన నీరాజనాలు..
విమానాశ్రయం నుంచి మోటేరా క్రికెట్ స్టేడియం వరకు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు ఇరువురు నేతలు. అయితే భద్రత కారణాల దృష్టా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ వేరు వేరు వాహనాల్లో ప్రయాణించారు. రోడ్ షో మార్గంలో ఇరువైపుల వందల సంఖ్యలో ప్రజలు అధ్యక్షుడు ట్రంప్‌కు నీరాజనాలు పట్టారు. నమస్తే ట్రంప్ అంటూ నినాదాలు చేశారు. వివిధ వేషధారణలతో అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలిపే విధంగా పలు ప్రదర్శనలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం. అందుకోసం 50 వేదికలు ఏర్పాటు చేసింది. ఈ వేదికలపై సంగీత, వాయిద్య, నృత్య కళాకారులు ప్రదర్శనలు చేశారు. అధ్యక్షుడి కారు తమ వేదిక సమీపంలోకి చేరుకోగానే రెట్టించిన ఉత్సాహంతో నృత్యాలు చేశారు.