దేశంలో కట్టలు తెంచుకున్న కరోనా మృత్యుఘోషని కొనసాగిస్తోంది. కొద్ది రోజులుగా రోజూ 900 మందికిపైగా కరోనాకు బలవుతున్నారు. ఇప్పటివరకు 56వేలకు పైగా మరణించగా ఈ ఒక్క వారంలోనే 5,800 మంది మరణించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారం వ్యవధిలో అనగా.. ఆగస్టు 16 నుంచి 22 వరకు 5,814 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో ఆగస్టు 19న ఒక్కరోజే 1,092 మంది మృతిచెందడం గమనార్హం.
అగ్ర స్థానంలో 'మహా'..
కొవిడ్ మృతుల్లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. దేశంలో మరణాల రేటులో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 21,698 మంది మృతిచెందారు. 6,340 మరణాలతో తమిళనాడు రెండోస్థానంలో ఉంది. కర్ణాటకలో 4,522 మంది, దిల్లీలో 4,270 మంది రోగులు చనిపోయారు.
ప్రతి 15 సెకన్లకు ఒకరు బలి..
ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి 8లక్షల మందికిపైగా కొవిడ్‌కు బలయ్యారని రూటర్స్ ట్యాలీ అనే అధ్యయన సంస్థ వెల్లడించింది. ఇందులో కేవలం ఒక్క అమెరికాలోనే 1.7 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో సగటున 5,900 మరణిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. గంటలో 246 మంది, ప్రతి 15 సెకన్లకు ఒకరు చొప్పున మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:కరోనా కాలంలో ఖైదీలకు ప్రత్యేక ఆహారం