తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్- చైనా సంయుక్త ప్రకటనపై భారత్​ ఫైర్

పాకిస్థాన్-చైనా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ మండిపడింది. కశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత విషయమని ఇందులో ఇతర పక్షాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. వారి సంయుక్త ప్రకటనను పూర్తిగా వ్యతిరేకించింది.

India rejects reference to J-K in China-Pak joint statement
పాకిస్థాన్​-చైనా సంయుక్త ప్రకటనపై భారత్​ ఫైర్

By

Published : Aug 22, 2020, 10:00 PM IST

చైనా, పాకిస్థాన్​ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్​ను ప్రస్తావించడాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకించింది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పూర్తిగా భారత అంతర్గత విషయమని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు తమ దేశ అంతర్గత విషయాల్లో సంబంధిత పక్షాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా తేల్చిచెప్పారు.

"చైనా-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల రెండో రౌండ్ చర్చల తర్వాత విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని గతంలో మాదిరిగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం."

-అనురాగ్ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

రెండో ద్వైవార్షిక వ్యూహాత్మక సమావేశంలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కశ్మీర్ అంశంపై చర్చించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్​(సీపెక్​) పురోగతిపైనా సమాలోచనలు జరిపారు.

ఈ మేరకు సీపెక్​ అంశంపైనా శ్రీవాస్తవా స్పందించారు. సీపెక్​పై భారత అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. భారత్​కు చెందిన భూభాగంలో ఈ ప్రాజెక్టు చేపట్టడాన్ని వ్యతిరేకించారు.

"సీపెక్​పై భారత్​కున్న ఆందోళన గురించి చైనా, పాకిస్థాన్​లకు చాలాసార్లు వివరించాం. చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో యథాతథ స్థితిని మార్చేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాం. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని పిలుపునిస్తున్నాం."

-అనురాగ్ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

జమ్ముకశ్మీర్​లోని సమస్యలపై చైనా అధికారులకు వివరించినట్లు వాంగ్, ఖురేషీ మధ్య చర్చల తర్వాత పాక్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ఈ సమస్యను ఐరాస చార్టర్ ప్రకారం పరిష్కరించుకోవాలని చైనా పేర్కొన్నట్లు సంయుక్త ప్రకటన వెల్లడించింది. భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించి చర్చించుకోవాలని, సమస్యను జఠిలం చేసేందుకు ఏకపక్షంగా తీసుకునే చర్యలకు చైనా వ్యతిరేకమని ప్రకటన పేర్కొంది.

ఇదీ చదవండి:'మహా'పై కరోనా పంజా- 22వేలకు చేరువలో మరణాలు

ABOUT THE AUTHOR

...view details