భారత్, చైనా సరిహద్దులో కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మైక్రోవేవ్ ఆయుధాలను వినియోగించిందంటూ వచ్చిన వార్తలను భారత్ ఖండించింది. ‘చైనా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో మైక్రోవేవ్ ఆయుధాలను ఉపయోగించిందనే మీడియా కథనాలు నిరాధారమైనవి. అవన్నీ నకలీ వార్తలు’ అంటూ భారత ఆర్మీ ట్వీట్ చేసింది.
నకిలీ కథనం
లద్దాఖ్‌లోని రెండు పర్వత ప్రాంతాల వద్ద మోహరించిన భారత్ బలగాలపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మైక్రోవేవ్ ఆయుధాన్ని వాడినట్లు యూకేకు చెందిన ప్రముఖ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆయుధాల వినియోగం అక్కడి ప్రాంతాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌గా మార్చిందని, బలగాలు ఎదురుపడి యుద్ధం చేయకుండానే చైనా ఆ పర్వత ప్రాంతాలను భారత్ నుంచి స్వాధీనం చేసుకుందని తెలిపింది.
బీజింగ్‌లోని రెన్‌మిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాన్‌రాంగ్ జిన్ వ్యాఖ్యల ఆధారంగా ఆ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రొఫెసర్ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. భారత్, చైనా సరిహద్దులోని ఉద్రిక్త ప్రాంతం వద్ద చైనా భారత సైనికులను మైక్రోవేవ్ ఆయుధాలతో ఎదుర్కొందని, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను గౌరవిస్తూనే ఆగస్టు 29న దాడి చేసిందని చెప్పుకొచ్చారు. మైక్రోవేవ్ రాడార్ టెక్నాలజీ ఆధారంగా ప్రాణాంతకం కాని ఆయుధ వ్యవస్థపై చైనా పనిచేస్తోందని 2019లో వార్తలు వెలువడ్డాయి. దానికి కొనసాగింపుగా ఆయన వ్యాఖ్యలు చేయడం బలం చేకూర్చాయి.