తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చలు జరుగుతున్నా అవేమీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్స్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపై ఇరుదేశాల మధ్య చిక్కుముడి ఏర్పడింది. ప్రస్తుతం ఫింగర్ 4కి సమీపంలో భారత సైన్యం, ఫింగర్ 5 వద్ద చైనా సైన్యం మోహరించి ఉన్నాయి. ఐతే ఫింగర్-4 నుంచి సమాన దూరంలో వెనక్కి వెళ్దామని చైనా చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది.
ఫింగర్ 8 నుంచి వాస్తవాధీన రేఖ వెళ్తుందని భారత్ చెబుతుంటే ఫింగర్ 2 నుంచి వాస్తవాధీన రేఖ వెళ్తుందని చైనా బుకాయిస్తోంది. ఫింగర్ 5 నుంచి ఫింగర్ 8 వరకు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గతంలో ఫింగర్ 8 వరకు భారత్ గస్తీ నిర్వహించేది. ఐతే ఇప్పుడు ఫింగర్-5 వరకు చైనా సైన్యం చొచ్చుకొచ్చింది. పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధ సామగ్రిని అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో ఫింగర్స్ ప్రాంతం నుంచి చైనా పూర్తిగా వెనక్కి తగ్గాలని భారత్ పట్టుబడుతోంది. ఫింగర్-4 నుంచి ఇరువర్గాలు సమాన దూరంలో వెనక్కి వెళ్లాలని చైనా చేసిన ప్రతిపాదన ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. 1993-96లలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోందని భారత్ అంటోంది. ఈ ఒప్పందాల ప్రకారం వాస్తవాధీన రేఖ అంశంలో భేదాభిప్రాయాలు ఉన్న చోట్ల ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదు. అందుకు విరుద్ధంగా ఫింగర్-5 వద్ద చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించి నిర్మాణాలను చేపట్టిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాతే చర్చలు..