తూర్పు లద్దాఖ్‌లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చిచెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్ ప్రతిపాదనను తిరస్కరించింది.
సామూహిక దాడులకు పాల్పడితే కాల్పులే..
ఉద్రిక్తత నెలకొన్న అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ సాగాల్సిందేనని స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన సైనిక కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో ఈ అంశాలపై భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వివరించింది. భారత శిబారాలను ఆక్రమించడానికి లేదా కర్రలు, శూలాలు తదితర ఆయుధాలతో సామూహిక దాడులకు చైనా ప్రయత్నిస్తే కాల్పులు జరపాలని మన బలగాలకు ఆదేశాలు అందాయి. ఇదే విషయాన్ని డ్రాగన్ సేనకు తెలియజేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. "సరిహద్దుల్లో బలగాల పరస్పర తోపులాటలను ఇక సహించబోమన్న సందేశాన్ని వారికి చేరవేశాం. ఆటవిక ఆయుధాల వినియోగమూ కుదరదని తేల్చి చెప్పాం" అని వివరించాయి.
పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇప్పటికే పలుమార్లు గాల్లోకి కాల్పులు జరుపుకొన్న ఘటనలు జరిగాయని గుర్తుచేశాయి. ఇందులో చిన్నపాటి ఆయుధాలను మాత్రమే ఉపయోగించారని, భారీ ఆయుధాలను ఇంకా క్రియాశీలం చేయలేదని తెలిపాయి. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతంలో భారత సైనికులకు.. అమెరికా నుంచి తాజాగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక సావర్ తుపాకులను అందజేసినట్టు పేర్కొన్నాయి.
సంకేతాలిచ్చాం..
జూన్ 15న గల్వాన్‌లోయలో ఇరుదేశాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేకమంది చైనా సైనికులు చనిపోయారని అధికారిక వర్గాలు చెప్పాయి. "సరిహద్దుల రక్షణకు ఎంతకైనా సిద్ధమన్న సంకేతాన్ని ఈ చర్య ద్వారా చైనాకు ఇచ్చాం. నాటి ఘర్షణతో బెటాలియన్ కమాండర్ సహా కనీసం ఐదుగురు సైనికులు చనిపోయినట్లు దౌత్య చర్చల్లో చైనా అధికారులు అంగీకరించారు. వాస్తవంగా వారి వైపు ప్రాణనష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు" అని ఓ అధికారి తెలిపారు. సరిహద్దులల్లో బలగాలను పెంచరాదంటూ కుదిరిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే.. చైనా మాటలను తాము గుడ్డిగా నమ్మబోమని, అప్రమత్తతను కొనసాగిస్తామని తెలిపారు. ఆ దేశం విశ్వఘాతుకానికి పాల్పడ్డ ఉదంతాలు అనేకం ఉన్నాయని వివరించారు.
మొదట మీరే..
బలగాల ఉపసంహరణ ప్రక్రియపై రెండు దేశాల సైన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలన్న అంశంపై ఏకాభిప్రాయం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 'బలగాల ఉపసంహరణపై జరిగే చర్చల్లో దెప్సాంగ్, సైనిక ప్రతిష్ఠంభన ఏర్పడిన ఇతర ప్రాంతాలనూ చేర్చాలని నిర్ణయించాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి కాకుండా ఏకకాలంలో ఉపసంహరణ జరగాలన్నాం. చైనా దురుసు చర్యల వల్లే ఈ సైనిక ప్రతిష్ఠంభన ఏర్పడిందని.. అందువల్ల బలగాల ఉపసంహరణ విషయంలో ముందుగా చర్యలు చేపట్టాల్సింది ఆ దేశమేనని తేల్చిచెప్పాం. పాంగాంగ్ దక్షిణ రేవులో భారత బలగాల ఆధీనంలో ఉన్న పర్వత ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకే వస్తాయని, అక్కడి నుంచి సైనికులను వెనక్కి రప్పించబోమని స్పష్టం చేశాం' అని తెలిపాయి. అయితే.. ఇరుదేశాల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొన్ని చర్చలు అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
నిఘా వైఫల్యం లేదు..
ఎల్ఏసీ వెంబడి చైనా 50వేలకుపైగా బలగాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించిందని భారత వర్గాలు తెలిపాయి. వీరి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నట్టు పేర్కొన్నాయి. ఏ దశలోనూ నిఘా వైఫల్యం లేదని వివరించాయి. అయితే.. చివరి నిమిషంలో జరిగే కదలికలు, మోహరింపులను తెలుసుకోవడం కష్టమని తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన తీరును వివరిస్తూ.. '"మే 5న గల్వాన్, పాంగాంగ్, నాకులా వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. పాంగాంగ్ సమీపంలో ఫింగర్-4 ప్రాంతం వద్ద సైనిక ప్రతిష్ఠంభన జరిగింది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో రెండు దేశాల తరఫున 30-40 మంది సైనికులు చొప్పున మాత్రమే అక్కడ ఉంటారు. కొద్దిసేపు ఎదురెదురుగా నిలబడ్డాక వెనుదిరుగుతుంటారు. మే నెలలో మాత్రం చైనా వెయ్యి మందికిపైగా సైనికులను అక్కడికి పంపింది. ఫింగర్-4 ప్రాంతాన్ని ఆక్రమించింది" అని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి:రెండు దేశాలతోనూ ఒకేసారి యుద్ధానికి సిద్ధం!