లద్ధాఖ్, సిక్కింలోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత బలగాలు అతిక్రమణనకు పాల్పడుతున్నాయన్న చైనా ఆరోపణలను తోసిపుచ్చింది భారత్. సరిహద్దు నిర్వహణలో భారత్ బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబిస్తోందని నొక్కిచెప్పింది. చైనా బలగాలే కొద్ది రోజులుగా అలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది.
సరిహద్దులో సాధారణ గస్తీ విధులకు ఆటంకం కలిగించే కార్యకలపాలు ఇటీవల చైనా వైపు వెలుగుచూశాయని పేర్కొన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.
"పశ్చిమ విభాగం లేదా సిక్కిం విభాగాల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత బలగాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయనే వాదనల్లో వాస్తవం లేదు. భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ అమరికపై భారత సైన్యానికి పూర్తి అవగాహన ఉంది. దానికి కట్టుబడి ఉంటుంది కూడా. తాము చేపడుతున్న అన్ని కార్యకలాపాలు పూర్తిగా భారత్లోని ఎల్ఏసీ వైపే. సరిహద్దు నిర్వహణ పట్ల భారత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటుంది. అదే సమయంలో భారత సౌర్వభౌమత్వం, భద్రతకూ కట్టుబడి ఉంటుంది."
– అనురాగ్ శ్రీవాస్తవ.
లద్ధాఖ్లోని సరిహద్దులను మార్చేందుకు భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కొద్దిరోజులుగా ఆరోపిస్తోంది చైనా. ఆ వాదనలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతోంది.