తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 19 వేలకు చేరువలో కరోనా కేసులు - రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ వివరాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 552 మంది కరోనాబారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా 335 మంది బాధితులు ముంబయి నుంచే ఉన్నారు. గుజరాత్​లో కేసులు 2 వేలు దాటగా... కేరళలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

coronavirus
రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ వివరాలు

By

Published : Apr 22, 2020, 5:10 AM IST

భారత్​లో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. కేసులు 18,985కు చేరుకున్నాయి. 15,122 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 3,259 మంది డిశ్చార్జి కాగా 603 మంది కరోనాకు బలయ్యారు.

మహారాష్ట్రలో ఈ మహమ్మారి కోరలు చాస్తోంది. కొత్తగా పాజిటివ్​గా తేలిన 552 మందితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 5,128కి చేరినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 251 మంది వైరస్​ కారణంగా మరణించినట్లు వెల్లడించారు. ముంబయిలో 12 మంది, పుణెలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు కరోనాతో తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న ముంబయిలో 355 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,445కి చేరుకోగా.. మరణాలు 150కి పెరిగాయి. 2,887 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. మరో 244 మంది అనుమానితులను ఆస్పత్రులకు తరలించారు.

రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ వివరాలు

గుజరాత్​

గుజరాత్​లో కరోనా కేసులు 2,178కి చేరాయి. కొత్తగా 239 మందికి వైరస్​ సోకింది. మరో 19 మంది కరోనా బాధితులు మరణించడం వల్ల.. మృతుల సంఖ్య 90కి చేరుకుంది. అహ్మదాబాద్​లోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 130 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,378కి చేరింది. ఎనిమిది మంది డిశ్చార్జి అయ్యారు.

కేరళలో మళ్లీ..

కేరళలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం 19 మందికి పాజిటివ్​గా తేలింది. కన్నూర్​లో 10, పాలక్కడ్​లో 4, కసరాగాడ్​లో 3, మలప్పురం, కొల్లంలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 426కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం 117 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు.

లాక్​డౌన్ ఆంక్షలను అతిక్రమిస్తూ కన్నూర్ జిల్లాలోని స్థానిక మసీదులో ఎనిమిది మంది వ్యక్తులు నమాజ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. ఆగ్రాలో 65 కేసులు సహా రాష్ట్రంలో 153 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఇద్దరు బాధితులే ఉన్న రాయ్​బరేలీలో.. ఒక్కరోజే ఏకంగా 33 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో యూపీలోని 53 జిల్లాల పరిధిలోని కేసుల సంఖ్య 1,337కి చేరినట్లు స్పష్టం చేశారు. 162 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించారు.

పంజాబ్​

పంజాబ్​లో మరో ఆరుగురికి కరోనా సోకింది. పాటియాలాలో 5, మొహాలీలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 251కి చేరినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా 62 కేసులు మొహాలీ, జలంధర్​లో 48 కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు.

బిహార్​

బిహార్​లో 13 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 126కి పెరిగింది. కొత్త వాటిలో ఏడు కేసులు ముంగర్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో నలందా జిల్లాలో గత నెల జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 60 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఛత్తీస్​గఢ్​లో..

ఛత్తీస్​గఢ్​లో ఓ కరోనా బాధితుడు కోలుకున్నాడు. రాయ్​పుర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న 33 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన రెండు పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అతడిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

మణిపుర్​ కరోనా ఫ్రీ

మణిపుర్​లో కరోనా బాధితులు లేరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇద్దరికి కరోనా సోకింది. ఒక వ్యక్తి ఇదివరకే కోలుకోగా.. మరో వ్యక్తి సైతం వైరస్ బారి నుంచి బయటపడ్డట్లు బీరెన్ సింగ్​ తెలిపారు. కరోనా టెస్టులో నెగెటివ్​గా తేలిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. అయితే ప్రజలందరూ అప్రమత్తంగానే ఉండాలని సూచించారు.

నాలుగు రోజులుగా కేసులు లేవు

హిమాచల్​ప్రదేశ్​లో వరుసగా నాలుగో రోజూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. మంగళవారం 453 శాంపిళ్లు పరిశీలించగా.. 278 మందికి నెగెటివ్ అని తేలినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నమూనాల నివేదికలు రావాల్సిఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 40 కేసులు నమోదయ్యాయి. 23 మంది చికిత్స పొందుతున్నారు. 11 మంది డిశ్చార్జి కాగా.. ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురిని బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details